అధ్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా

అధ్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా
  • చలోక్తులు విమర్శలు పిట్టకథలు
  • కేటీఆర్ పర్యటన సాగింది ఇలా.. 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేటలో  ఐటీ హబ్  తో పాటు 530 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా సూర్యాపేటకు సోమవారం చేరుకున్న కేటీఆర్  కు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్ హెలిపాడ్ వద్ద ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. హెలిపాడ్ నుండి నేరుగా పాత కలెక్టరేట్ వద్దకు కేటీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి  ఐటీ హబ్ ను ప్రారంభించారు. అనంతరం అక్కడే గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీ హబ్ లో కొలువై ఉన్న పలు కంపెనీలను సందర్శించి , అక్కడ యాజమాన్యం ఉద్యోగులతో ముచ్చటించారు. అక్కడినుండి  నూతనంగా నిర్మించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించారు.

అనంతరం అక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, పట్టణ వ్యాప్తంగా ఒకటి రెండు ప్యాకేజీల కింద నిర్మించనున్న సిసి, డ్రైన్ పనులకు, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు వాటర్ పైప్ లైన్, దోబీ ఘాట్ నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే నూతనంగా నిర్మించిన మున్సిపల్ కాంప్లెక్స్, మహిళా కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అక్కడినుండి కొత్త బస్టాండ్ నుండి సూర్యాపేట పుర వీధులలో వేలాది గా కదం దొక్కిన బిఆర్ఎస్ పార్టీ సైనికులు, సూర్యాపేట నియోజకవర్గం ప్రజల తో కలిసి ర్యాలీగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎంజీ రోడ్డు లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడినుండి శంకర్ విలాస్ సెంటర్ , వాణిజ్య భవన్, రాఘవ ప్లాజా, పీఎస్ఆర్ సెంటర్ , పూల సెంటర్ కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా  మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు. వేదికపై తొలుత   సూర్యాపేట పట్టణంలో దశాబ్దాలుగా ఎటువంటి ఆదరణకు నోచుకోకుండా ఫుట్ పాత్ లపై  చెప్పులు కుట్టుకుని జీవిస్తున్న వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపేందుకు గాను ఆరుగురు చర్మకారులకు దళిత బంధు పథకం కింద బచ్చలకూరి సైదులు, గడ్డం నరసింహ, చింతలచెర్ల రత్నమ్మ, గంట నాగరాజు, గోవుల రవి, శోభ అనే దళిత కుటుంబాలకు 10లక్షల చొప్పున 60 లక్షల అందజేశారు.

అనంతరం రహదారుల విస్తరణ సందర్భంగా దుకాణాలను కోల్పోయిన 22 మంది యజమానులకు నూతనంగా నిర్మించిన సమీకృత ఇంటిగ్రేటెడ్  వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నందు 22 దుకాణాలకు సంబంధించిన యాజమాన్య పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆ తరువాత ఎటుటువంటి అక్రమాలు, అవినీతి కి తావు లేకుండా లబ్ధిదారుల సమక్షంలోనే  లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బిజెపి నేతలపై విరుచుకు పడ్డారు.