హైదరాబాద్​లో  మహిళ దారుణ హత్య

హైదరాబాద్​లో  మహిళ దారుణ హత్య
  • లైంగికదాడి చేసి అంతమొందించారు
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  • 48గంటల్లో నివేదిక ఇవ్వాలని
  • సీఎస్, డీజీపీలకు గవర్నర్ తమిళిసై ఆదేశం
  • సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని నానక్ రాంగూడలో కొందరు దుండగులు ఓ మహిళపై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నానక్ రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగింది. మృతిరాలు గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెరబస్తీకి చెందిన కాశమ్మ (38) అనే మహిళగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 25న పాత ఇనుప తుక్కు సామాన్లు సేకరించడానికి నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై దుండగులు లైంగిక దాడిచేసి, బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. గత శుక్రవారం నుంచి బాధితురాలు కనిపించడం లేదంటూ ఆదివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు  పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నానక్ రాంగూడలో మహిళ లైంగికదాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌదర్య రాజన్ సీరియస్ అయ్యారు. ఘనటపై 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు.

సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్
నానక్ రామ్ గూడలో జరిగిన మహిళ అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర మహిళ కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆదేశించారు. ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  ఈ ఘటన దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.