మత్తు ఇంజక్షన్ ఇచ్చి  మహిళ పరారీ

మత్తు ఇంజక్షన్ ఇచ్చి  మహిళ పరారీ
  • తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని
  • పాలమూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం 

మహబూబ్ నగర్, ముద్ర: పాఠశాల వదిలిన తర్వాత సరదాగా పాఠశాల ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ చిన్నారి విద్యార్థినిపై ఓ గుర్తుతెలియని మహిళ ఘాతుకానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాజ్ పేట మండల పరిధిలోని పుట్టోనిపల్లితండా ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అనన్య అనే ఎనిమిదేళ్ల విద్యార్థిని గురువారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఒంటరిగా పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఓ అపరిచిత మహిళ వైద్య సిబ్బంది రూపంలో అక్కడికి వచ్చింది. విద్యార్థిని అక్కడ ఉంచిన స్కూల్ బ్యాగును తనతోపాటు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అది గమనించిన  విద్యార్థిని తన బ్యాగు తనకు ఇవ్వాలని ఆ మహిళను అడిగింది. బ్యాగును ఇవ్వడానికి నిరాకరించిన ఆ మహిళ విద్యార్థినిని బెదిరించి తన వెంట తెచ్చిన ఇంజక్షన్ బలవంతంగా ఆ విద్యార్థిని కుడిచేతికి ఇచ్చింది.

ఆ తర్వాత  స్కూల్ బ్యాగును కూడా ఆ విద్యార్థినికి ఇచ్చి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఇంటికి చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయానికి అస్వస్థతతో కనిపించింది.  తల్లిదండ్రులు అలివేలు, లక్ష్మణ్ చిన్నారిని అడగగా ఎవరో ఆంటీ వచ్చి బెదిరించి ఇంజక్షన్ ఇచ్చి వెళ్లిందని, అందువల్ల తన చేయి నొప్పిగా ఉందని జవాబు ఇచ్చింది. ఎవరో  వైద్య సిబ్బంది అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి ఉంటారని అనుకొని దాని గురించి పెద్దగా పట్టించుకోని తల్లిదండ్రులు రాత్రి సమయానికి విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇంజక్షన్ ఇచ్చిన వారి గురించి ఆరా తీశారు. అయితే గ్రామానికి సంబంధించిన ఆశా వర్కర్లు తాము ఎవరం కూడా చిన్నారికి ఇంజక్షన్ ఇవ్వలేదని చెప్పారు.  

దీంతో తమ వద్ద ఉన్న జ్వరం  మాత్ర  వేసి ఆమెను ఆ రాత్రికి పడుకోబెట్టారు. శుక్రవారం ఉదయానికి ఆ చిన్నారికి వాంతులు, విరేచనాలు  అయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.  అక్కడ  డాక్టర్లు బ్లడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ జరిగిందని అందువల్లే విద్యార్థిని అస్వస్థతకు గురైందని వివరించారు. చికిత్స  అనంతరం చిన్నారిని తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఆమె అస్వస్థత తేరుకోకపోవడంతో పాఠశాలకు పంపకుండా తమ పర్యవేక్షణలోనే ఉంచుకొని సపర్యలుచేస్తున్నారు. మండలానికి మారుమూలన గల తమ తండాలోకి ప్రవేశించి చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఆగంతుకురాలిని గుర్తించి పట్టుకుని, తగిన చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. ఈ విషయమై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థిని తండ్రి లక్ష్మణ్  తెలిపారు.