కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మహిళల ఆందోళన....

కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మహిళల ఆందోళన....

ముద్ర ప్రతినిధి , జగిత్యాల: జగిత్యాల పట్టణంలో పలువురు మహిళలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు స్వంత ఇల్లు కాని, సెంటు భూమి కానీ లేదని అద్దె ఇళ్ళలో కాలం వెలదీస్తున్నామని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం దరకాస్తు చేసుకుంటే ఇల్లు ఇవ్వలేదన్నారు. అద్దె ఇళ్ళలో  ఉంటే చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకురావద్దంటున్నారని తాము చనిపోతే తమ శవాలను ఎక్కడికి తీసుకెళ్లాలని మహిళలు ప్రశ్నించారు. గతంలో  నూక పల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో చాలామందికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించగా కొందరు బేస్మెంట్ లెవెల్, మరికొందరు వివిధ స్థాయిలో నిర్మాణాలు చేసుకున్నారు. అయితే అధికారులు ఆ ప్రాంతం అంతా చదును చేసి ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లు నిర్మించారు. స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లో అవకాశం ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి  కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇంట్లో అద్దెకున్న వారికి ఇల్లు మంజూరు కాలేదు కానీ ఇంటి యజమానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరయ్యాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చేరుకున్న పట్టణ సిఐ కిషోర్ మహిళలకు నచ్చజెప్పి ఇక్కడ ఆందోళన చేయవద్దని ఆర్డీవో కార్యానికి వెళ్తే అక్కడ అక్కడ మీ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొనడంతో మహిళలు అర్దిఒ కార్యాలయానికి  తరలి వెళ్లారు. దరఖాస్తులు పరిశీలించిన ఆర్డీవో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు ఇల్లు వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు అల్లాల రమేష్ రావు, బింగి రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.