కాంగ్రెస్ టికెట్ బరిలో నలుగురు

కాంగ్రెస్ టికెట్ బరిలో నలుగురు
  • దామోదర్ రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
  • నాలుగు స్తంభాలాట లో ఆర్డీఆర్ ఆశీస్సులు ఎవరికో?

తుంగతుర్తి ముద్ర: ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ తుంగతుర్తి రాజకీయం ఊపొందు కుంటోంది ఇప్పటివరకు అధికార పార్టీ అయిన బిఆర్ఎస్ కు విపక్ష కాంగ్రెస్ బిజెపిల నుండి అంతగా ఒత్తిడి కనిపించలేదు. కాగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ ఆశించే అభ్యర్థులు ఒక్కొక్కరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. తుంగతుర్తి నుండి టికెట్ ఆశించే వారు ముందుగా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డినీ ప్రసన్నం చేసుకోవాల్సిందే. సుమారు నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కంచుకోటగా మలిచిన దామోదర్ రెడ్డినీ కాదని టికెట్ తెచ్చుకున్న ఓటమి తప్పదు అనేది గత రెండు ఫలితాలు చెప్పకనే చెప్పాయి.

ఈసారి టికెట్ వేటలో అద్దంకి దయాకర్ ,గుడిపాటి నరసయ్య ,అన్నపర్తి జ్ఞాన సుందర్,నగరిగారి ప్రీతం కుమార్ లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం నరసయ్యకు దామోదర్ రెడ్డి అనుచరుడుగా ముద్ర ఉంది. గత రెండు పర్యాయాలు ఓటమి పాలైన దయాకర్ ముచ్చటగా మూడోసారి పోటీలో దిగడానికి దామోదర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈనెల మూడవ తేదీన దామోదర్ రెడ్డిని హైదరాబాద్ లో ని ఆయన నివాసంలో కలిసి ఇటీవల జరిగిన మోకాళ్ళ శస్త్ర చికిత్స విషయాన్ని అడిగి తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉప్పు నిప్పులా ఉంటూ గతంలో దామోదర్ రెడ్డి పై ఆరోపణలు చేసిన దయాకర్ ఈ విధంగా దామోదర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నా లు చేస్తున్నారు. అద్దంకి దయాకర్ రెండుసార్లు తాను స్వల్ప మెజారిటీ తో తో ఓడిపోయానని, మూడవసారి అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని చెప్తున్నారు. మరో కాంగ్రెస్ నేత నగరి గారి ప్రీతం ఇటీవల కోటమర్తి దేవాలయానికి దామోదర్ రెడ్డి ఇచ్చినట్లు చెబుతూ లక్ష రూపాయల విరాళం అందజేసి తాను దామోదర్ రెడ్డికి దగ్గరగానే ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చారు.

అద్దంకి, ప్రీతం లతో కలిసి గతంలో దామోదర్ రెడ్డి పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత అన్నపర్తి జ్ఞాన సుందర్ తాను దామోదర్ రెడ్డిని ఎల్లప్పుడూ గౌరవిస్తానని, తాను దామోదర్ రెడ్డికి దగ్గరగానే ఉన్నానని సంకేతాలు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. తాను రాజకీయాలు మొదలుపెట్టిన నాటినుండి నేటి వరకు కాంగ్రెస్ లోనే ఉంటున్నానని, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అనేక సమస్యలపై అధికార పార్టీ నీ నిలదీశానని,అనునిత్యం ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నానని ,తనదే టికెట్ అని జ్ఞానసుందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించే వారు ఎవరైనా రాజకీయంగా గట్టిపట్టున్న దామోదర్ రెడ్డిని కాదని బిఫామ్ పొందిన ఎన్నికల్లో శృంగభంగం తప్పదని తెలిసి, ఎవరికి వారు తమ తమ రాజకీయ చతురతతో దామోదర్ రెడ్డికి దగ్గర అవ్వాలని చూస్తున్నా, మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నలుగురిలో ఎవరికి దామోదర్ రెడ్డి ఆశీస్సులు లభించి బి .ఫామ్ వస్తుందో వేచి చూడాల్సిందే.