ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

ప్రీతి ఆత్మహత్యాయత్నం  ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
A thorough inquiry should be conducted into the incident of Preeti suicide attempt

హైదరాబాద్‌: వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈటల.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్‌ కొనసాగుతోంది. మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైంది.

ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హెచ్‌వోడీలే చర్యలు తీసుకోవాలి. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్‌వోడీ స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మాహత్యయత్నం చేసుకునేదికాదు. చివరకు ప్రిన్సిపల్‌ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ఈటల డిమాండ్‌ చేశారు.