కాంగ్రెస్ పార్టీలో తీరని అన్యాయం

కాంగ్రెస్ పార్టీలో తీరని అన్యాయం
  • దళితుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ లోని రెడ్డి నాయకులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూస్తారు
  • కాంగ్రెస్ లో అంతా రెడ్ల రాజకీయం నడుస్తుంది
  • కాంగ్రెస్ ను భూ స్థాపితం చేయడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కంకణం
  • ఎన్ని పార్టీలు మారినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీ సీటు... మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ ను దళితుడనే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదు
  • కాంగ్రెస్ పార్టీని శ్వాసగా, జీవితంగా బతికిన మాకు సీటు లేదు
  • సీటు దక్కలేదని పటేల్ రమేష్ రెడ్డిని కర్గేతో కల్పిస్తారు... దళితులకు సీటు రాకున్నా పట్టించుకునే నాధుడే ఉండడు.. ఏ హామీలు ఇవ్వరు
  • కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఒక నీతి, దళితులకు బీసీలకు మైనార్టీలకు మరొక నీతినా..ఇదెక్కడి న్యాయం
  • కోమటిరెడ్డి బ్రదర్స్ ఇసుక బుక్కడానికే మందుల సామేలుకు తుంగతుర్తి సీటు
  • క్వారీలకు కాపలాదారుగా మందుల సామేలు
  • రెడ్లకు తాబేదారుగా ఉండలేను
  • అడుగులకు మడుగులెత్తలేకనే బాధాతప్త హృదయంతో ఆత్మగౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా
  • కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుముల పురి రవిబాబు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కాంగ్రెస్ పార్టీలో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుములపురి రవి బాబు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నెహ్రు నగర్ లో గల ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా నాన్న అనుముల పూరి పరంధాములు సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటినుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాననీ, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా పేరు సంపాదించానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చంద్రబాబుకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో పనిచేసే వ్యక్తులకు సరియైన గుర్తింపు లేదని, మాల సామాజిక వర్గం కాదని మాదిగ సామాజిక వర్గం కు టికెట్ ఇవ్వాలనుకుంటే తుంగతుర్తిలో గుడిపాటి నరసయ్య, ప్రీతo లకు టికెట్లు ఇవ్వకుండా మందుల సామెల్ కు టికెట్ ఎందుకు ఇచ్చారని, సామేలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు బినామీ అని తెలిపారు. మందుల సామెల్ ను అడ్డం పెట్టుకొని తుంగతుర్తిలో ఇసుక దందా చేయడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. మందుల సామేలును కేవలం ఇసుక క్వారీల దగ్గర కూలిగా పెట్టుకోవడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ ఇప్పించారని ఆరోపించారు.

ఎన్ని పార్టీలు మారినా రాజగోపాల్ రెడ్డికి సీటు ఇచ్చారని, అయితే మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ దళితుడనే కారణంగా కాంగ్రెస్ పార్టీ లోకి ఎందుకు తీసుకోలేదని రవిబాబు ప్రశ్నించారు. రెడ్లంతా ఒకటేనని, కాంగ్రెస్ టికెట్ రాని పటేల్ రమేష్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గేతో కల్పించి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, అదే తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలలో సీటు ఆశించి భంగపడ్డ తమను కాంగ్రెస్ అగ్ర నాయకులకు ఎందుకు కల్పించి హామీఎందుకు ఇప్పించలేదని,  ఇంత వివక్ష, ద్వంద నీతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంటే పార్టీ నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని, ఇంకా ఎన్నాళ్లు తాబేదారులుగా బతకాలని, ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండాలని,రెడ్లకు ఒక నీతి, దళితులు, బీసీలు, మైనార్టీలకు మరొక  నీతినా అని రవిబాబు  ప్రశ్నించారు. సూర్యాపేటలో డిసిసి అధ్యక్షులు,రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కలిసి ఇంతవరకు మాట్లాడలేదని, దళితులంటే వారికి చిన్న చూపు అని విమర్శించారు. సూర్యాపేటలో బడుగు బలహీన వర్గాలు ఏకమై దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా! లేదా రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరుతారా! అన్న విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పంగ రెక్క సంజయ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు, కర్నాటిరాజేష్, అనుములపూరి రాజీవ్, పరందాములు, సాయిరాజ్, జలీల్, మణిరాజ్, శ్రీకాంత్, సమ్మధ్, నామ రాకేష్, విజయ్ భాస్కర్, నిధి కుమార్, వడ్డే రాజు తదితరులు పాల్గొన్నారు.