మంత్రిని  ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

మంత్రిని  ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట: మంత్రికి అనుకూలంగా ఉండి భజన చేస్తే సహకరిస్తున్నారని,  ప్రశ్నించేవారిపై   కేసులు పెడుతున్నారని, ఇది  సూర్యాపేటలో షరా మామూలు అయిపోయిందని బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. సూర్యాపేట పట్టణ బీజేపీ  కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  మంత్రి జగదీశ్వర్ రెడ్డి భూకబ్జాదారులకు అండగా ఉంటూనే నీతులు చెబుతున్నాడని ధ్వజమెత్తారు.  కటికం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేరు చెప్పుకుంటూ ముప్పిడి సుధాకర్ రావు  భూమి కబ్జా చేసి 2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకు  అనేక ఇబ్బందులు పెట్టి ఏడు తప్పుడు కేసులను నమోదు చేయించాడని తెలిపారు.  2017 సంవత్సరం నుండి ఇప్పటివరకు భయపెడుతూ  ఆయన   భూమిలో  ఏ పంటలు వేసుకున్న నాశనం చేస్తున్నాడని ,ఇలా 2017 నుండి ఇప్పటివరకు సుమారు 20 లక్షల రూపాయలు నష్టం కలిగించాడని,  ఇప్పటికీ సుధాకర్ భూమిలో ఉన్న రాతి కడ్డీలను , ఫెన్సింగ్ ను, రెండు టేకు చెట్లను  ఎత్తుకుపోయాడని అన్నారు. 

సూర్యాపేట న్యాయస్థానం భూమి సుధాకర్ ది అని తీర్పు ఇచ్చినా   పోలీసులు  పట్టించుకోవడం లేదనీ,పోలీసు రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వివరించారు.  2011 సంవత్సరంలో సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జి, హైకోర్టు 2021లో   భూమి సుధాకర్ ది అని తీర్పు కూడా ఇచ్చాయని అన్నారు. అయినా  ఈ తీర్పును లెక్కచేయకుండా మంత్రి పేరు  చెప్పుకుంటూ పోలీసుల   సహాయంతో సుధాకర్ భూమిలోకి అక్రమంగా  చొరబడ్డారని ఆరోపించారు. సూర్యాపేటలో భూ  కబ్జాలకు వ్యతిరేకంగా  భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.