లోక్ అదాలత్ లో రాజీ ద్వారా ఇరు పక్షాలకు విజయం

లోక్ అదాలత్ లో రాజీ ద్వారా ఇరు పక్షాలకు విజయం
  • మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్,
  • సీనియర్ సివిల్ జడ్జి జిట్ట శ్యాం కుమార్.
  • జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం ద్వారా ఇరుపక్షాలు విజయం సాధించినట్లు అవుతుందని, గెలుపు ఓటములు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. శనివారం పట్టణ కోర్టు హాలులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని  మాట్లాడారు. కేసులను రాజీ చేసుకోవడం ద్వారా ఇరుపక్షాల మధ్య కక్ష పూరిత వాతావరణం తొలగిపోయి స్నేహ సంబంధాలు బలపడతాయన్నారు. లోక్ అదాలత్ లో జారీ కాబడిన అవార్డుపై అప్పీలు చేసుకునే అవకాశమే లేదన్నారు. కోర్టుకు చెల్లించిన కోర్టు ఫీజులు కూడా తిరిగి కక్షిదారులకే చెల్లిస్తామన్నారు. లోక్ అదాలత్ అవార్డు సివిల్ కోర్టు డిక్రీ తో సమానం అన్నారు. భవిష్యత్తులో ఇరుపక్షాలలో ఎవరైనా లోక్ అదాలత్ లో జారీ కాబడిన అవార్డుకు భిన్నంగా ప్రవర్తించినట్లయితే చట్ట ప్రకారం అట్టి అవార్డు అమలు కొరకు తగు ఆదేశములు జారీ చేయమని కోరుతూ తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చునన్నారు.

ఈనెల 9న జరిగే  జాతీయ మెగా లోక్ అదాలత్ లో  పెద్ద మొత్తంలో కేసులు రాజీ కావడానికి ఇప్పటికే పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేశామని మీడియా ప్రతినిధులు కూడా తమ ప్రచార మాద్యమాల ద్వారా లోక్ అదాలత్ విజయవంతానికి విస్తృత ప్రచారం చేయాలని,లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు రాజీ కావడానికి తమ వంతు తోడ్పాటును అందించాలని ఆయన  కోరారు. దొంగతనం కేసులలో కూడా ఫిర్యాదుదారుడు ఇష్టపడితే,లోక్ అదాలత్ లో అట్టి కేసును రాజీ చేసుకోవచ్చని  చెప్పారు. జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ గత లోక్ అదాలత్ లో 500 కేసులు రాజీ కాగా 20 లక్షల రూపాయలు జరిమానాల రూపంలో కక్షిదారులు చెల్లించినారని ఈ నెల 9న జరగబోయే మెగా లోక్ అదాలత్ లో ఇప్పటికే 517 కేసులు రాజీ అయ్యాయని 11 లక్షల రూపాయలను జరిమానాల రూపంలో కక్షిదారులు చెల్లించినారని, అట్టి 517 కేసులలో 500 కేసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులేనని చెప్పారు. మొత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2000 వరకు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో సుమారుగా 1000 కేసులు రాజీ కాగలవనే  ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రామిసరీ నోటు కేసులలో కక్షిదారులు రాజీ పడితే బాకీ పైకాన్ని ఒకసారి కాకుండా వాయిదా పద్ధతుల్లో కూడా చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పాత్రికేయులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, న్యాయశాఖ సిబ్బంది శ్యాం కుమార్, సుశీల, తాటి విజయభాస్కర్ రెడ్డి, సోహైల్, సైదా నాయక్, రేణుకయ్య, నాగరాజు, హలీం తదితరులు పాల్గొన్నారు.