జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
  • తక్షణమే బీసీల జనాభా గణన చేపట్టాలి
  •  సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ

 ముద్ర కోదాడ: జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ. సత్యనారాయణ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు నివాసంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏండ్లు గడుస్తున్నా దేశవ్యాప్తంగా 60% పైగా ఉన్న  జనాభాలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జనాభా గణన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బీసీ కులాల జనాభా లెక్కించేందుకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 

 బీసీల జనాభా లెక్క ఎంతో తేల్చి ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న మాదిరిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేసి రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ, పార్లమెంట్ అన్ని రకాల చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పెరిక హాస్టల్ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, రామినేని శ్రీనివాసరావు, సుంకరి అజయ్ కుమార్, గుండా  గోపి, సముద్రాల. రాంబాబు, పత్తిపాక. వేణుధర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.