అసైన్డ్ భూములకు నాది గ్యారంటీ

అసైన్డ్ భూములకు నాది గ్యారంటీ
  • ఆరు గ్యారంటీలు అబద్ధం
  • బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:అసైన్డ్ భూములు ఎవరు తీసుకోరు... ఎలాంటి ఫ్యాక్టరీలకు ఇవ్వరని మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వట్టి జూటా మాటలని, ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఆదివారం మెదక్ మండలం వెంకటాపూర్, రాజ్ పల్లి, తిమ్మక్కపల్లి, బాలానగర్, సంగాయిగుడి, పెద్ద బాయి, మంగళగుట్ట, ఎదురుగడ్డ తండాల్లో గ్రామగ్రామాన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలల్లో ఒక్క పథకానికైనా అర్థం, స్పస్టత ఉందా అని ప్రశ్నించారు.

మహిళల కష్టాలు చూసి ఇంటింటికి భగీరథ నీళ్లు, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అందజేసిన సీఎం కొత్తగా సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 3 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది, సంక్షేమ ఫలాలను గడపగడపకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ప్రగతికి దూరంగా ఉన్న పల్లెలు నేడు ప్రగతి పథంతో సాగుతున్నాయన్నారు.  వృద్ధులకు ఆసరా పెన్షన్ రూ.5016, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మీ పథకంలో ద్వారా అర్హులైన పేద మహిళలకు రూ.3వేలు పెన్షన్, రైతు బంధు సాయం రూ.16వేలకు పెంచనున్నట్లు తెలిపారు. కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమాగా నిల్వనుందన్నారు.

ప్రధాని మోడీ వంట గ్యాస్ ధరను రూ.12వందలకు పెంచితే సీఎం కేసీఆర్ రూ.4వందలకే అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.  ఈ ప్రచారంలో జెడ్పి వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మెదక్ మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి,  ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ దేవాజి గారి మోహనా చారి, సర్పంచులు నిర్మల, వికాస్ కుమార్, కాజిపల్లి ఉపసర్పంచ్  ఆశయ, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొత్తపల్లి రవీందర్, మల్కాపూర్ మోహన్, సిద్ధిరాములు, రాయిన్ పల్లి సర్పంచ్ సిద్ధగౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మెన్నేని మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తిమ్మానగర్ యువకులు బిఆర్ఎస్ లో చేరారు.