గర్భస్రవంతో శిశువు మృతి

గర్భస్రవంతో శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతోనేనని బంధువులు ఆందోళన

 ముద్ర ప్రతినిధి, జనగామ:  గర్భసంచి పగిలి శిశువు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కొండ్ర సరిత నెలల గర్భిణి ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో 15 రోజుల కింద పట్టణంలోని స్వప్న హాస్పిటల్ కు తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్లు గర్భసంచి లూజుగా ఉందని చెప్పి కుట్లు వేశారు. మళ్లీ రెండు వారాల తరువాత అలాగే నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున  సరితను అదే ఆస్పత్రికి తీసకొచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె సలహా మేరకు ఆస్పత్రిలో ఉన్న నర్సు ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరువాత 15 నిమిషాలకే గర్భసంచి పగిలింది. దీంతో కడుపులో ఉన్న మగ శిశువు చనిపోయింది. తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని గర్భిణి బంధువులు ఆరోపించారు.

హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతి చెందిన శిశువును ఆస్పత్రి వారు డస్ట్ బిన్లో వేయడంతో బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆస్పత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఎస్సైలు  రుక్మాచారి, సృజన్ రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. గతంలో ఇలాంటి ఘటనలు నాలుగు సార్లు జరిగాయని బాధితులు ఆరోపించారు. సీఐ శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. భాద్యులపై తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. తెల్లవారుజామున గర్భిణిని తీసుకొచ్చారని, నొప్పులు తగ్గేందుకు ఇంజక్షన్ ఇవ్వగా.. కొద్దిసేపటికే గర్భ సమస్య వల్ల అబార్షన్ జరిగిందని వివరించారు. ఆందోళనలో మేము సైతం ఫౌండేషన్ సభ్యులు మంగళంపల్లి రాజు, అజయ్, తుంగ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.