బీఆర్‌ఎస్‌ అడుగులు.. అక్కడ వరకేనా

బీఆర్‌ఎస్‌ అడుగులు.. అక్కడ వరకేనా

సంక్రాంతి తర్వాత ఏపీలో నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరేందుకు క్యూ కడతారు. అప్పుడు నాకంటే విూరు బిజీ అవుతారు’’ ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తో చేసిన కామెంట్స్‌ ఇవి. ఏపీ నుంచి ఎవరు బీఆర్‌ఎస్‌ లో చేరతారు? ఏ నేతలు చేరే అవకాశముంది? అధికార వైసీపీ నుంచా? ప్రతిపక్ష టీడీపీలో నుంచా? లేక అక్కడ కుదేలైపోయిన కాంగ్రెస్‌ నేతలా? అన్న లెక్కలు వేసుకుంటూ ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఉండిపోయారు. వచ్చిన వాళ్లకు కండువాలు కప్పేందుకు కూడా ఆయన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు.

కానీ బీఆర్‌ఎస్‌ లో చేరేందుకు ఇంత వరకూ ఎవరూ ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బీఆర్‌ఎస్‌ లో ఇప్పటి వరకూ పట్టున్న నేతలు ఏపీ నుంచి ఎవరూ చేరలేదన్న కామెంట్స్‌ సోషల్‌ విూడియాలో వినిపిస్తున్నాయి. చేరిన వారందరూ ప్రజల్లో పెద్దగా పట్టులేని వారేనని, కేవలం ఆర్థిక బలాన్ని చూసే వారిని బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారని అనేవారు లేకపోలేదు. మరో వైపు బీఆర్‌ఎస్‌ ఏపీలో జగన్‌ కు బి టీమ్‌ గా పనిచేస్తుందని కూడా విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే బీఆర్‌ఎస్‌ లోకి కాపు సామాజికవర్గం నేతలను ఎక్కువగా కేసీఆర్‌ చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేశాయి. అయితే ఇంతవరకూ బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని కూడా ఏపీలో ప్రారంభించలేదు.

భవనాన్ని చూశారు తప్పించి దానిని ఫైనల్‌ చేయలేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన విశాఖకు ఇద్దరు ముఖ్యమంత్రులు రానున్నారు. శారదాపీఠంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చి వెళతారా? లేదా ఒకే సమయంలో వస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులు విశాఖలో భేటీ అయితే విపక్షాల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునే ఛాన్స్‌ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఒకే సమయానికి వచ్చినా బహిరంగంగానే కార్యక్రమంలో పాల్గొని ఎవరి దారిన వారు వెళ్లిపోతారు తప్ప ఎలాంటి సమావేశం వారి మధ్య జరిగే అవకాశం లేదని చెబుతున్నారు మరోవైపు విశాఖలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టాలని అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు.

తేదీ ఇంకా నిర్ణయం కాకపోయినప్పటికీ బహుశ మార్చిలో విశాఖలో బహిరంగ సభ ఉండే అవకాశముంది. వచ్చే నెలలో హైదరాబాద్‌, నాందేడ్‌ లో సభలు ఉన్నందున విశాఖ సభను మార్చి చివరి వారంలో జరిపే అవకాశముందని చెబుతున్నారు. ఆ సందర్భంగా కొందరు నేతలు పార్టీలో చేరే అవకాశముందంటున్నారు. కేసీఆర్‌ నేరుగా తనతో పరిచయమున్న నేతలతో మాట్లాడుతున్నారని, కొందరు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ నేతలు ఎవరన్నది గోప్యంగానే ఉంచుతున్నారు. విశాఖ కేసీఆర్‌ సభలో తప్పించి ఇప్పట్లో బీఆర్‌ఎస్‌ లో ఏపీ నుంచి ఎవరూ చేరరన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అప్పటి వరకూ బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడుకు పెద్దగా పని ఉండదన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి.