అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే గత ప్రభుత్వాలకి పట్టిన గతే పడుతుంది : సిఐటియు

  • జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి

ముద్ర ప్రతినిధి భువనగిరి :అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పట్టక తప్పదని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చేస్తున్న సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి, సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు మంత్రితో శాంతియుత చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లు పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని, 10 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం సమ్మెను విచ్చిన్నం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదన్నారు.

ఉద్యమాలను అణచడానికి చూస్తే చరిత్ర క్షమించదని వారు అన్నారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో పట్టణాల్లో అంగన్వాడి ఉద్యోగులు ఆయాలు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పు పౌష్టికఆహారాన్ని అందిస్తున్న అంగన్వాడి ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి మార్చుకొని అంగన్వాడి సెంటర్లను తాళాలు విరగొట్టి అంగన్వాడి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం ఐసిడిఎస్ అధికారులు వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూరుగు స్వప్న, సిహెచ్ రామాకుమారి మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న మా పట్ల ప్రభుత్వం వేధింపులు, బెదిరింపులు ఆపాలని మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గొరిగే సోములు, జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరి ఆంజనేయులు, మంచాల మధు, బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లాలో ఉన్న అంగన్వాడి టీచర్లు ఆయాలు   పాల్గొన్నారు .