ప్రజలే నా ఆశ.. శ్వాస

ప్రజలే నా ఆశ.. శ్వాస
  • నా గౌరవాన్ని పెంచిన గడ్డ గజ్వేల్
  • రాష్ట్రాభివృద్ధి కోసం అనుక్షణం తపించా
  • తొలిరోజుల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారు
  • అన్ని గండాల నుంచి బయట పడి రాష్ట్రాన్ని ఒక రేవుకు తెచ్చా
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆకలి చావులే
  • వరంగల్, గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :  సుమారు 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలే నా ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాన‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అనుక్షణం తపించానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మ‌న శ‌త్రువులు, స‌మైక్యవాదులు కుట్రలు చేశారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనాల‌నే ప్రయ‌త్నం చేశారన్నారు. ఇట్లాంటి ఎన్నో ఆటంకాల‌ను అధిగ‌మించి రాష్ట్రాన్ని ఒక స్థాయికి తెచ్చానని సీఎం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం వరంగల్, గజ్వేల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​మాట్లాడారు. 

గ‌జ్వేల్ ప్రజలు నన్ను సీఎంను చేశారు..

గ‌జ్వేల్ నియోజకవర్గం నుంచి  ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి  రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారన్నారు. అలాంటి ప్రజలకు ఏమిచ్చినా రుణం తీరదన్నారు. ఎంతో మంది బలిదానాల మీద సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్న తపనతో పనిచేశానని, అవ‌న్నీ ప్రజ‌ల కండ్ల ముందు క‌నిపిస్తున్నాయన్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఇది నా చివ‌రి స‌భ‌.. ఇది 96వ స‌భ‌ అని తెలిపారు.  మరోసారి బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలని, పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు, ఆకలి చావులు వస్తాయని హెచ్చరించారు.

సంపదను పెంచి.. ప్రజలకు పంచాలనుకున్నాం..

రాష్ట్రంలో సంపదను పెంచి, ప్రజలకు పంచాలనుకున్నామని కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను ఆదుకోవాలని చూశామని, అందులో భాగంగా  మొద‌ట సంక్షేమం తీసుకున్నామన్నారు.ఆ త‌ర్వాత వ్యవ‌సాయ రంగాన్ని స్థిరీక‌రించుకున్నామన్నారు. దీంతో రైతుల ముఖాల్లో సంతోషం చూశామన్నారు. అన్ని వ‌ర్గాల విద్యార్థులు చ‌దువుకోవాల‌నే ఉద్దేశంతో గురుకుల పాఠ‌శాల‌లు, కాలేజీలు స్థాపించామన్నారు. ప్రతి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ పెట్టుకున్నామన్నారు. హైద‌రాబాద్‌లో ఇంతుకు ముందు ఎప్పుడు పోయినా ఉస్మానియా, గాంధీ, నిలోఫ‌ర్ త‌ప్ప ఇంకోటి తెలియదన్నారు. కానీ రాబోయే ఐదారు నెల‌ల్లో న‌గ‌రంలో నాలుగు మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. మ‌రో 2 వేల ప‌డ‌క‌ల‌తో నిమ్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.  రాష్ట్రంలో 24 గంట‌ల క‌రెంట్ సరఫరా చేస్తున్న కారణంగా  పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయని అని కేసీఆర్ తెలిపారు.

నా గౌరవాన్ని పెంచిన గడ్డ గజ్వేల్..

నన్ను ముఖ్యమంత్రిని చేసి నా గౌరవాన్ని పెంచిన గడ్డ  గజ్వేల్‌ అని కేసీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే.. ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్‌ అని కేసీఆర్​ చెప్పారు. గజ్వేల్‌కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదని, కానీ రైలు కూడా వచ్చేసిందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్‌ మోడల్‌ అభివృద్ధిని చూడటానికి వస్తున్నారన్నారు. మన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కావచ్చు.. ఇట్ల అనేక రకాల పనులను చూడటానికి ఇయ్యాల గజ్వేల్‌కు వస్తున్నారని కసీఆర్​అన్నారు.