చంద్రబాబు తొత్తు రేవంత్ రెడ్డి ...

చంద్రబాబు తొత్తు రేవంత్ రెడ్డి ...

3 గంటల 3 పంటలా చర్చిద్దాం ... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: విద్యుత్ పాలసీని తప్పుపడుతున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తు అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోని 193 దేశాల్లో ఎక్కడ అమలు చేయని కరెంటు పాలసీతో వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల 3 రైతు వేదికల వద్ద చర్చ జరగాలన్నారు.

ఈనెల 17 నుండి 27వ తేదీ వరకు నియోజకవర్గంలోని 38 రైతు వేదికల వద్ద 3 గంటల విద్యుత్ కావాలా 3 పంటల విద్యుత్తు కావాలనే అంశంపై రైతులతో చర్చించాలని అన్నారు. వ్యవసాయం దండగ అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఐదు గంటల కరెంటు ఇచ్చిండన్నారు.2014 ముందు వ్యవసాయం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయించి మూడేళ్లలో కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన ప్రసంగాలతో రైతులను గందరగోళంలోకి నెట్టిన రేవంత్ రెడ్డి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీపీలు రేఖాగట్టయ్య, సుదర్శన్, జడ్పిటిసిలు మారపాక రవి, ఇల్లందుల బేబీ శ్రీనివాస్, ఆకుల కుమార్, సర్పంచ్ టీ సురేష్ కుమార్, ఎంపీటీసీలు రాజు, దయాకర్, నరసింహులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ పోలేపల్లి రంజిత్ రెడ్డి వార్డు సభ్యురాలు సుజాత నాయకులు స్వాతి, పావని, జ్యోతి మాచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.