సోషల్ మీడియా పై గట్టి నిఘా.

సోషల్ మీడియా పై గట్టి నిఘా.
  • బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి.
  • కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో కలెక్టరేట్  ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మానిటరింగ్ సెల్ లను (ఎం.సీ.ఎం.సీ)ను ఎస్పీ రాహుల్ హెగ్డే , అదనపు యస్.పి నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి   జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ సందర్శించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ సెంటర్  ద్వారా  మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (mcmc)ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనల వంటి వాటి పై తక్షణమే స్పందించడం జరుగుతుందని అలాగే షాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని సూచించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్ లు, సోషల్ మీడియా, మరియు సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక నిఘా ఉంచామని,  ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చర్యలు  తీసుకోవడం జరుగుతుందని అన్నారు . ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా పూర్తి సహకారం   అవసరమని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు .

బ్యాంకు ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ నందు బ్యాంకు సిబ్బంది డిజిటల్ లావాదేవీల పై రోజువారి జరుగు ఖాతాల వివరాలు, ఎక్కువ మొత్తంలో ఖాతాలలో జమ చేయడం , ఎక్కువ ఖాతాలకు డబ్బులు పంపడం లాంటివి జరుగుతున్న ఖాతాలపై ఈ సెల్  రోజువారి వివరాలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో  అదనపు పౌర సంబంధాల అధికారి ఏ. రమేష్ కుమార్,డి.ldm బాపూజీ ,ఈ.ఐ.ఈ మల్లేశం, ఎం సి ఎం సి కమిటీ సబ్యులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.