గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసితుల హక్కు పత్రాల సేకరణ    

గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసితుల హక్కు పత్రాల సేకరణ    

కేసముద్రం, ముద్ర: ఎన్.హెచ్163 జి వరంగల్- ఖమ్మం మధ్య నూతనంగా వేయనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేసిన అధికారులు, భూ నిర్వాసితులకు ఫైనల్ అవార్డు ప్రకటించడానికి మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో కేసముద్రం మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కేసముద్రం మండలంలోని కోరుకొండ పల్లి, మహమూద్ పట్నం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితుల నుంచి భూ యాజమాన్యపు హక్కు పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా కొందరు తమకు సంబంధించిన భూమిలో చెట్లు, బావులు పూర్తిస్థాయిలో నమోదు చేయలేదని, ఫలితంగా తమకు పరిహారం అందకుండా పోయే పరిస్థితి నెలకొందని అధికారులకు విజ్ఞప్తి చేయగా, ఆమేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం తహాసిల్దార్ పులి సాంబశివుడు, భూ సేకరణ విభాగం సూపరిండెంట్ అనురాధ, సెక్షన్ అధికారి ఫిరోజ్, ఆయా గ్రామాలకు చెందిన భూనిర్వాసితులైన రైతులు పాల్గొన్నారు.