BRS Aashirwada Sabha in Husnabad కాంగ్రెస్, బిజెపిలకు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు

BRS Aashirwada Sabha in Husnabad కాంగ్రెస్, బిజెపిలకు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు
  • తెలంగాణకు కెసిఆర్ అపర భగీరధుడు
  • లక్ష ఓట్ల మెజారిటీతో సతీష్ ని గెలిపించాలి
  •  హుస్నాబాద్ మున్సిపాలిటీ 25 కోట్లు  మంజూరు
  • హుస్నాబాద్  బిఆర్ఎస్ ఆశీర్వాద సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు( కేటీఆర్) అన్నారు. రాష్ట్రాన్ని 40 సంవత్సరాలుగా పరిపాలించి సర్వ నాశనం చేసిన కాంగ్రెస్కు జనధన్ ఖాతాలు తీయించి 15 లక్షలు వేస్తానని మోసగించిన ప్రధాని మోడీకి తెలంగాణలో ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ లో శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాల చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం బస్సు డిపో పక్కన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి నియోజకవర్గస్థాయి ఆశీర్వాద సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని అశేషమైన ప్రజానీకాన్ని, పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

తెలంగాణ ఏర్పాటు అయ్యాక తాగునీటి, సాగు  నీటి పథకాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. ఆనాడు ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆకాశము నుంచి భూమ్మీదకి భగీరథ మహర్షి తీసుకురాగా , భూమ్మీద ఉన్న నీటిని ఎనిమిది వందల మీటర్ల పైకి ఎత్తి తెలంగాణ ప్రజలకు అందించిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి అందాయని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాష వ్యవహార శైలి చూస్తుంటే అతను ఎంపీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అనిపిస్తుందని విమర్శించారు కనీసం వారం పేరు కూడా గుర్తు పెట్టుకోకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లిందన్నారు వచ్చే ఎన్నికల్లో బండిని ఓడించి వినోద్ కుమార్ ను గెలిపించుకొని పరువు నిలబెట్టుకోవాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాల కు సాగునీటిని అందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గము విశేషమైన సేవలందిస్తూ ప్రజలకు దగ్గర అయిందని అభినందించారు. ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు మరో 25 కోట్ల రూపాయలను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు. నియోజకవర్గంలో హుస్నాబాద్ నుండి కొత్తపల్లి జనగామ హైవే రోడ్డును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కోరిక మేరకు మరో రెండు గ్రామాలను హుస్నాబాద్ పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితవెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి,  గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, తదితరులు ప్రసంగించగా సభలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పి చైర్ పర్సన్ విజయ, హనుమకొండ జెడ్పి చైర్మన్ సుధీర్ ,లేబర్ కోఆపరేటివ్ డైరెక్టర్  రాజ్యలక్ష్మి సంపత్ , ఎంపీపీలు జడ్పిటిసిలు మానస, మంగా, లక్ష్మి, కర్ర శ్రీహరి,హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన పేట సైదాపూర్, భీమదేవరపల్లి , ఎల్కతుర్తి ,చిగురు మామిడి మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, రైతుబంధు నాయకులు, సర్పంచులు ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.