ఓటమి భయంతో నకిలీ పత్రాలు సృష్టించారు

ఓటమి భయంతో నకిలీ పత్రాలు సృష్టించారు

నామినేషన్ తిరస్కరణకు విశ్వప్రయత్నం చేశారు.
న్యాయం గెలిచింది..
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు
 
 ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  పెద్దపెల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఓటమి భయంతో నా పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి, నామినేషన్ తిరస్కరణ గురి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు.  సోమవారం జిల్లా కేంద్రంలో మసీద్ చౌరస్తా వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోటో మార్ఫింగ్ చేసి ఇతరులకు సంబంధించిన బ్యాంకు ఖాతాను నా పేరు మీద ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారని, కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆరోపణను తోసిపుచ్చారని తెలిపారు. పెద్దపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ సజావుగానే ఉన్నట్టు  తెలిపారు.


స్ధానిక ఎమ్మెల్యే దాసరి తన అనుచరులతో నాకు విదేశాల (మలేషియా దేశం )  నుండి భారీగా లావాదేవీలు అయినట్టు, నాకు బిఎం డబ్ల్యూ కారు ఉన్నట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, నా ఫోటోలను, మార్ఫింగ్ చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్టు తెలిపారు. తనపై దుష్ప్రచారంలో ప్రజాస్వామ్యం గెలిచిందని  అన్నారు. స్ధానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణల వ్యవహారాలను పెద్దపల్లి ప్రజలు గమనిస్తున్నారని, అతనికి ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారని  పేర్కొన్నారు.