తండ్రి ఎంఎల్ సి, కోడుకు ఎమ్మెల్యే...

తండ్రి ఎంఎల్ సి, కోడుకు ఎమ్మెల్యే...

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్ : తొలిసారిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కూచకుళ్ళ తండ్రి తనయులు అధికార పదవులతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇది చారిత్రకమైన రోజు, చారిత్రక ఘట్టం అంటూ అభిమానులు సంతోషంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సందడి చేస్తున్నారు. పాలమూరు ప్రాంతం నుంచి నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన తండ్రి కూచకుళ్ళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా ఇప్పుడు ఆయన తనయుడు డాక్టర్ కూచకుళ్ళ రాజేష్ రెడ్డి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తన తండ్రి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాన్ని తాను సాధించి చూపించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

దామోదర్ రెడ్డి గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా పని చేయగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మరోమారు ఎమ్మెల్సీగ ఎన్నికయ్యారు. తాజా రాజకీయ పరిణామాల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన కొడుకుకు పార్టీ టికెట్ సాధించారు. ఎన్నికల్లో పోటీ చేయడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయడంతో అంతా కలిసి వచ్చి తాను గెలవలేకపోయినా ఎమ్మెల్యే స్థానాన్ని తన కొడుకు ద్వారా గెలిపించుకుని తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. కాగా ప్రమాణస్వీకారాల అనంతరం 14వ తేదీ నుంచి తొలిసారి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో తండ్రి కొడుకులు కలిసి అసెంబ్లీలో ప్రవేశించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశం అయ్యింది. ఇద్దరూ కలిసి అసెంబ్లీలో దిగిన ఫోటో అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నార. ఎంతో కాలానికి దామోదర్ రెడ్డి కల తన కుమారుడి ద్వారా నెరవేరడంతో జిల్లాలో మొదటి సారిగా తండ్రి కొడుకులు ఓకే సారి అసెంబ్లీలో ఉండడం “చరిత్రలో లిఖించదగిన” “చారిత్రాత్మక రోజు” అంటూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో వైరల్ గా మారింది.