ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా వరం

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా వరం
  • అధికారంలో లేకున్నా ప్రజాక్షేత్రంలోనే ఉంటాం
  • అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ గెలిచింది
  • మోడీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నరు
  • ఐదేళ్లలో బండి సంజయ్ ఎన్ని ఊర్లు తిరిగాడు
  • ఓటమి భయంతోనే బండి లోకల్ నాన్ లోకల్ కామెంట్స్
  • కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష హోదా వరమని ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజా సమస్యలపై గళమెత్తే వీలుంటుందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కానీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ చేసిన అభివృద్ధి ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేసిందన్నారు.

14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల లో రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు.

గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన కూడా కరీంనగర్ లో ఉంటూ నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత హైదరాబాద్ కే పరిమితమయ్యాడని, ఐదేళ్లలో బండి సంజయ్ ఐదు కొత్తల నిధులు తేలేదని, ఐదేళ్లలో ఎన్ని ఊర్లు తిరిగాడో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.

ఓటమి భయంతోనే బండి సంజయ్ లోకల్ నాన్ లోకల్ కామెంట్స్ చేస్తున్నాడని దుయ్యబడ్డారు. నేను కూడా కరీంనగర్ గడ్డపైనే పుట్టినవాడనని పేర్కొన్నారు.

రాజకీయాల్లో లోకల్, నాల్ లోకల్ అనేది ఉండదని ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. మరి ప్రధాని నరేంద్రమోడీ ది గుజరాత్ రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. బీజేపీలో సుమారు 50 మంది వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసిన వారే ఉన్నారని పేర్కొన్నారు.రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులు గా ఉండొద్దని హితువు పలికారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్ రావు, నాయకులు చల్లా హరిశంకర్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు