ఫ్రెండ్లీ పోలీసింగ్ దేశానికే ఆదర్శం

ఫ్రెండ్లీ పోలీసింగ్ దేశానికే ఆదర్శం
  • తెలంగాణ ప్రభుత్వంలో  శాంతి భద్రతలకు ప్రాధాన్యం
  •  ఉపముఖ్యమంత్రి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహిముద్ అలీ

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రభుత్వం పోలీసు శాఖకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని హంగులతో నూతన భవనాలను ఏర్పాటు చేయటం, ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలు చేయటం హర్షించదగ్గ విషయమని ఫ్రెండ్లీ పోలీసింగ్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ఎం.డి. మహమూద్ అలీ అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్, మల్టీ జోన్ ఐ జి పి షహనావాజ్ ఖాసిం, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోహేటి దామోదర్, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వనపర్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) కార్యాలయాన్ని 29.29 ఎకరాలలో, రూ.32 కోట్ల వ్యయంతో సువిశాల భవనాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్, త్రాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యాయని, నల్గొండ జిల్లా లాంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారని, ప్రస్తుత రాష్ట్రంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు ఆయన వివరించారు.

పోలీసు శాఖలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6 వేల సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 9 వేల 600 మంది సిబ్బందిని నియమించినట్లు ఆయన సూచించారు. 10 జిల్లాలుగా వున్న తెలంగాణ రాష్ట్రాన్ని సులభతరం చేస్తూ 33 జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు, తద్వారా ప్రతి గ్రామం, పట్టణ స్థాయిలలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖలో షీ టీమ్ లను ఏర్పాటు చేయటం, ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలు చేయటం, అందరికీ సమ న్యాయం జరిగేలా చట్టాలను రూపొందించటం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, అన్ని పోలీస్ స్టేషన్ లలో సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆయన వివరించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణతో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, తద్వారా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పలు రంగాలలో ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కొనియాడారు. వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల, జేఎన్టీయూ కళాశాల మంజూరు కావటం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాలకు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఆయన వివరించారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేద ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం మాదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

పోలీసు శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారని, శాంతి భద్రతలు అమలు చేయటంలో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొహెటి దామోదర్ మాట్లాడుతూ సుమారు రూ.2.5 కోట్లతో మారుమూల ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పూర్వపు పోలీస్ శాఖ, ప్రస్తుత పోలీస్ స్టేషన్ల నిర్మాణం ద్వారా మారుమూల ప్రాంతాల వారికి పోలీస్ సేవలు విస్తరించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెడ్లీ పోలీస్ విధానం, షి టీమ్ ల ఏర్పాటు అమలు చేస్తున్న విధానం దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్ శాఖ నిలుస్తున్నారని ఆయన అన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.పి. రక్షిత కె. మూర్తి అందిస్తున్న సేవలను అభినందిస్తూ, ఉత్తమ సేవలు అందించటంలో తమ వంతు కృషి చేస్తున్నదని ఆయన కొనియాడారు. శాంతి భద్రతలు అమలు చేయడంలో పోలీసు శాఖ నిర్విరామంగా కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.