ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రూ. 1441 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రూ. 1441 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. దేశంలోని మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకదానిని ఆంధ్ర ప్రదేశ్‌కు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖూబా తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిందని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖూబా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 2000.46 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించామని కేంద్ర మంత్రి తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అభివృద్ధి అంచనా వ్యయం రూ.1441 కోట్లు అని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

బల్క్ డ్రగ్ పార్క్‌లోని తయారీ యూనిట్లకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి అడిగినప్పుడు ఇతర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై కేంద్రం 3% వడ్డీ రాయితీని ఇస్తోందని, 10 సంవత్సరాల కాలానికి రాష్ట్రానికి చేరిన నికర SGSTలో 100% తిరిగి కేంద్రం చెల్లించనుందనీ కేంద్రమంత్రి తెలిపారు. కాకినాడ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ రంగానికి ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడానికి ఈ పార్క్ ఉపయోగపడనుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర సహాయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేయడం వల్ల కాకినాడ ప్రాంతం దేశంలోనే ఫార్మాస్యూటికల్ హబ్‌గా ఎదగడానికి దోహదపడుతుందన్నారు.