Mana ooru Mana Badi Program: సర్కారు బడులు బాగు పడుతున్నాయ్‌–  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Mana ooru  Mana Badi Program: సర్కారు బడులు బాగు పడుతున్నాయ్‌–  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Government schools are improving Minister Errabelli Dayakar Rao

(ముద్ర ప్రతినిధి, జనగామ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు బడులు బాగుపడుతున్నాయని, కార్పొరేట్‌ కు దీటుగా స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చి, కరెంటు వచ్చి, వ్యవసాయం పెరిగిందని తద్వారా భూముల ధరలు పెరిగాయని, రైతుల గౌరవం పెరిగిందని తెలిపారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం లక్ష్మణ్ తండాలో మండల పరిషత్ స్కూల్‌లో విద్యార్థుల కోసం రూ.14.90 లక్షలతో ఏర్పాటు చేసిన పలు వసతులను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక తండాలు అభివృద్ధి చెందాయన్నారు.

ధర్మపురంలోని ఐదు తండాలకు రూ.2 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ నీళ్లు అందజేస్తున్నట్లు చెప్పారు. మన ఊరు మన బడి కింద రూ.7,289 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్‌‌ కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ మన ఊరు మన బడి పథకానికి జిల్లాలోని 174 స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేశారని తెలిపారు. ఈ పథకం పాఠశాలల రూపు రేఖలు మారాయని చెప్పారు.  తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ఈ వసతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం మంత్రి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి శంకు స్థాపన చేశారు. తర్వాత పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి మహా శివరాత్రి ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో  కె.రాము, మన ఊరు - మన బడి ప్రత్యేక అధికారి వినోద్ కుమార్, ఎంపీపీ బసవ సావిత్రి , జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామి రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి,  సర్పంచ్ భూక్యా వీరేశ్, హెచ్‌ఎం పి.వీరారెడ్డి, స్కూల్ చైర్మన్ భూక్యా లక్ష్మణ్ పాల్గొన్నారు.