ముత్తిరెడ్డి హత్యా రాజకీయాలు సహించం

ముత్తిరెడ్డి హత్యా రాజకీయాలు సహించం

చేర్యాల భూమిపై తండ్రీ కూతుళ్ల డ్రామాలు
జనగామలో పార్టీ మనుగడే లేకుండా చేస్తున్రు
హైకమాండ్‌ అన్నీ గమనిస్తుంది
ఈసారి స్థానికులకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలి
ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎంతో ఎమ్మెల్యేలుగా పనిచేశారు.. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాదిరిగా కబ్జాలు, హత్యా రాజకీయాలు ఎవరూ చేయలేదని ఆప్కో మాజీ చైర్మన్‌, బీఆర్‌‌ఎస్‌ నేత మండల శ్రీరాములు మండిపడ్డారు. ఇక ఆయన హత్యా రాజకీయాలు సహించబోమని ఆయన స్పష్టం చేశారు. గురువారం జనగామలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలతో పాటు పార్టీ హైకమాండ్‌ గమనిస్తుందన్నారు. గతంలో తనను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి ముత్తిరెడ్డికి సపోర్ట్ చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారని, అందకే రెండు సార్లు తాను ముత్తిరెడ్డితో కలిసి పనిచేశానని చెప్పారు.

 కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక జనగామలో భయంకర వాతావరణం తయారైందన్నారు. ముత్తిరెడ్డి, ఆయన బావమరిది సంపత్‌రెడ్డి మండలాల వారీగా గ్రూపులు, హత్య రాజకీయాలు చేస్తూ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటి ఫలితంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సంపత్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు ఏమిటని ఆయన ఫొటోలు ఫ్లెక్సీలో పెడుతున్నారని మండల ప్రశ్నించారు. ఉద్యమ కాలంలో పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు‌ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాను చేస్తున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టిని ఏమార్చేందుకు ముత్తిరెడ్డి, ఆయన కుమార్తె తుల్జాభవానీరెడ్డి చేర్యాల భూమిపై డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.  

బీఆర్‌‌ఎస్‌ను బతికించుకుంటాం...
జనగామలో బీఆర్ఎస్‌ను బతికించుకోవడంతో పాలు కేసీఆర్‌‌ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మండల శ్రీరాములు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ రెవిన్యూ డివిజన్‌గా ఉన్నప్పటి నుంచి తాను క్రియాశీల రాజకీయాల్లో ఉన్నానని గుర్తుచేశారు. స్థానికేతరుడైన ముత్తిరెడ్డికి పార్టీ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిందన్నారు. ముత్తిరెడ్డి చేస్తున్న అక్రమాలతో ఇక ఒక్క క్షణం ఆయన్ను మోయడానికి ఇక్కడి కార్యకర్తలు సిద్ధంగా లేరని చెప్పారు. ముత్తిరెడ్డికి నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని హితవుపలికారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఈసారి స్థానికుడినైన తనను పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. అయితే తాను కూడా జనగామలో ప్రజాధరణ ఉన్నవారికే టికెట్‌ ఇవ్వాలని పార్టీని కోరినట్టు చెప్పారు. దీనిపై ఎలాంటి సర్వే అయినా చేసుకోవాలని పార్టీ హైకమాండ్‌కు సూచించినట్టు తెలిపారు. సమావేశంలో  బీఆర్‌‌ఎస్‌ జిల్లా నాయకులు బొట్ల జీవరత్నం, వజ్జ పర్శరాములు, చొప్పరి శ్రీను, గంగరబోయిన చంద్రమౌళి పాల్గొన్నారు.