కాళేశ్వరం వద్ద పెరిగిన వరద: 57 గేట్ల ఎత్తివేత

కాళేశ్వరం వద్ద పెరిగిన వరద: 57 గేట్ల ఎత్తివేత

మహాదేవపూర్, ముద్ర: గోదావరి ప్రాణహిత నదులు కలిసే కాలేశ్వరం వద్ద గురువారం గోదావరి నీటిమట్టం 10.130 మీటర్లకు చేరుకున్నది. బుధవారం నాడు గోదావరి నీటిమట్టం 9.70 మీటర్లుగా ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది ద్వారా వరద ఉధృతి పెరిగినట్లు తెలుస్తుంది. కాగా గురువారం నాడు మహాదేవపూర్ ప్రాంతంలో వర్షం లేకపోగా ఎండ కాయడంతో వాతావరణం పొడిగా ఉంది. గోదావరికి వరద ఉధృతి పెరగడంతో మేడిగడ్డ వద్ద 57 గేట్లను ఎత్తివేశారు. దీంతో గోదావరి నది ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రవహించినట్లుగానే నిలకడగా ఉంది.

మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో 4,38,880 క్యూసెక్కుల ప్రవాహంతో ఉండగా 57 గేట్లు ఎత్తివేయడంతో 4,85,030 క్యూసెక్కుల నీరు నీటిపారుదల శాఖ అధికారులు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 16.17 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం 7.646 టీఎంసీల నీటి పరిమాణం మాత్రమే ఉంటుంది. ఈరోజు వర్షం ఆగిపోవడంతో పాటు గోదావరి వరద నిలకడగా ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.