పత్తి రైతు నిలువ దోపిడి

పత్తి రైతు నిలువ దోపిడి
  • ఎమ్మార్పీ కంటే నాలుగు రెట్లు అధిక ధరలతో విక్రయాలు
  • నిబంధనలు పాటించని డీలర్లు,షాపు యజమానులు
  • చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు

ముద్ర న్యూస్,కాటారం:ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి ముందే పత్తి రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ ధర 853/- రూపాయలకు విక్రయించాల్సిన పత్తి విత్తనాల ప్యాకెట్ ను 2,500 నుంచి 3,500 వరకు అధిక ధరలతో డీలర్లు,షాపు యజమానులు అమ్ముతున్నారు.చేసేది లేక రైతులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మల్హర్,మహా ముత్తారం మండలాలలో ఈ ఖరీఫ్లో 40 వేల ఎకరాల పత్తి పంట సాగుతుందని వ్యవసాయ అధికారుల అంచనా.దీనికోసం సుమారు 60 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయి.30 వేల ప్యాకెట్ల వరకు వివిధ రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను ఉపయోగించినా.. పేరున్న పది రకాల పత్తి విత్తనాలను మాత్రం మరో 30 వేల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేస్తారు.ఈ లెక్కన రైతులు ఒక్కో ప్యాకెట్ కు 2,000 రూపాయలను రైతులు అదనంగా వెచ్చించినా..6 కోట్ల రూపాయలను విత్తనాల కొనుగోలుకే రైతులు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో ఖరీఫ్ సాగు మొదట్లోనే కోట్ల రూపాయలు అదనంగా వెచ్చిస్తున్న రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

నిబంధనలు పాటించకున్నా చర్యలు శూన్యం

ఎరువులు విత్తనాలు పురుగుమందుల షాపు యజమానులు,డీలర్లు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.అయితే కాటారం, మహాముత్తారం,మల్హర్ మండలాల్లోని షాపు యజమానులు,డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అమ్మకాలు, కొనుగోలు జరుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన స్టాక్ ను స్టాక్ రిజిస్టర్ లో ఎంటర్ చేసి అమ్మకాలు జరిగిన విధంగా రోజువారీగా నమోదు చేయాల్సి ఉంటుంది.కానీ ఈ మండలాలలో పలు షాపులలో నిల్వ ఉన్న స్టాకుకు, రికార్డులకు పొంతనే ఉండదని పలువురు అంటున్నారు. అంతేకాకుండా రిటైల్ షాపు యజమానులే హోల్సేల్ బిల్లులను ఇస్తూ నిబంధనలను పట్టించుకోవడంలేదని సమాచారం.ఇలాంటివి జరగకుండా వ్యవసాయ అధికారులు దశలవారీగా తనిఖీలు చేయాలి. నిబంధనలు పాటించని షాపులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.కానీ వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.దీంతో ఎరువులు,పురుగు మందులు, విత్తనాల షాపుల యజమానులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. కొనసాగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య ధోరనితోనే షాపుల యజమానులు విచ్చలవిడి విక్రయాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

టోకెన్ సిస్టంతో అధిక ధరలకు చెక్

గతంలో రైతులు పత్తి విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే కావలసిన మేరకు నమోదు చేసి టోకెన్లు ఇచ్చేవారని దాంతో ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ దరకే విత్తనాల ప్యాకెట్లు లభించేవని రైతులు పేర్కొన్నారు. కానీ అలాంటి నిబంధనలను ప్రస్తుతం అవలంబించకపోవడంతో షాపుల యజమానులు డిమాండ్ను బట్టి అధిక ధరలు నిర్ణయించి విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ కాలం మొదట్లోనే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పత్తి రైతు రాజవ్వడం దేవుడెరుగు కూలీలుగా మారుతున్నామని పలువురు రైతులు తమ దీన పరిస్థితిని ఏకరువు పెట్టారు. ప్రభుత్వం,ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు కటినతరం చేసి అధిక ధరలను అరికట్టి కల్తీ,నకిలీ లను నివారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.