ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి

కేసముద్రం, ముద్ర: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేసముద్రం మండలంలోని కోరుకొండ పల్లి, తాళ్ల పూస పల్లి, కల్వల, అన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసిల్దార్ సాంబశివుడు, ఏవో వెంకన్న సందర్శించారు. పలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రం చేసుకోవడానికి ప్యాడి క్లీనర్లు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే మరికొన్ని కేంద్రాల్లో గన్ని కొరత ఉందని, ఇంకొన్ని కేంద్రాల్లో దాన్యం కాంటాలు పూర్తిచేసి మిల్లుకు తరలించకుండా ఉండడాన్ని చూసి సెంటర్ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 కిలోమీటర్ల లోపు మిల్లులు కొనుగోలు కేంద్రం ఉంటే ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆపై దూరానికి లారీలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. కాంటాలు పూర్తిచేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లుకు తరలించాలని సూచించారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల వీఆర్ఏలు సందర్శించి నిర్వహణ తీరుపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం పరిశీలించి తేమ తక్కువగా ఉంటే వెంటనే రైతులకు టోకెన్లు జారీ చేయాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల సిబ్బంది, రైస్ మిల్లర్ల తో తహసిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తహసిల్దార్ ఆదేశించారు.