దంచి కొడుతున్న వాన..  గ్రామాలన్నీ జలమయం

దంచి కొడుతున్న వాన..  గ్రామాలన్నీ జలమయం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావంతో రెండు రోజులుగా వాన దంచి కొడుతోంది. దీంతో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. ఫలితంగా గ్రామాలన్నీ జలమయం అయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ వాగు పొంగిపొర్లుతోంది. నమిలిగొండ పెద్ద చెరువు మత్తడి పడడంతో చెరువు కింద ఉన్న రోడ్డు దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డిఓ సుహాసిని, తాసిల్దార్ పూల్ సింగ్ చౌహన్, పంచాయతీ రాజ్ ఈఈ అక్కడకు చేరుకొని తాత్కాలిక రవాణా ఏర్పాట్లను చేశారు. భారీ వర్షాలకు మండల కేంద్రంలోని 15వ వార్డు జలమయమై ఇళ్లలోకి నీరు చేరి బియ్యము, బట్టలు సామాగ్రి పూర్తిగా వరద నీటిలో తడిసిపోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చిల్పూర్ మండలంలోని చిల్పూర్, మల్కాపూర్, చిన్న పెండ్యాల వాగులు  పరవళ్ళు తొక్కుతుంది. 

నష్కల్ వాగు పై నిర్మించిన చెక్ డాం మత్తడి పడడంతో గ్రామస్తులు చేపల వేటకు దిగారు. సోమవారం రాత్రి మంగళవారం పగలంతా భారీ వర్షం కురియడంతో రెండు మండలాల్లోని చిన్నాచిత కుంటలు, చెరువులు మత్తల్లు పడ్డాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పలు గ్రామాల్లో రోడ్డు దెబ్బతిన్నాయి, శిథిలావస్థకు చేరిన ఇంటి గోడలు పడిపోయాయి. ఈ వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం  లేకపోయినప్పటికీ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆయా చెరువులు, కుంటలు, రోడ్లను పరిశీలించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మల్లన్న గండి రిజర్వాయర్ లోకి వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుండడంతో  రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ప్రభావం అధికంగా ఉండడంతో ఫతేపూర్, కృష్ణాజి గూడెం, పల్లగుట్ట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిల్పూర్ తాసిల్దార్ ఆయా గ్రామాల ప్రజలను హెచ్చరించారు.