ఇకనుండి పంచాయతీలు నేరుగా బిల్లుల డ్రా

ఇకనుండి పంచాయతీలు నేరుగా బిల్లుల డ్రా
  • తెలంగాణ పల్లెలు దేశానికే దిక్సూచి
  • పదింటికి పది సంసద్ అవార్డులు తెలంగాణకే
  • అవార్డుల ప్రధానోత్సవం లో మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇకనుండి గ్రామపంచాయతీలు బిల్లుల కోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు... అకౌంట్లోనే జమ చేస్తాం.... నేరుగా డ్రా చేసుకోవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. బుధవారం మెదక్ సాయి బాలాజీ గార్డెన్స్ లో  రాష్ట్ర స్థాయిలో  రెండు,  జిల్లా స్థాయిలో 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...పోటీ తత్వం పెరగడానికి ఈ అవార్డులు దోహదం చేస్తాయన్నారు. ఎంపీ లు దత్తత తీసుకునే గ్రామ పంచాయతీలకు ఇచ్చే పది అవార్డులు మొత్తం తెలంగాణకే వచ్చాయన్నారు. ఢిల్లీ లో అవార్డులు ఇస్తున్నారు...గల్లీ కొచ్చి విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా బిజెపిని విమర్శించారు. నోటితో మెచ్చుకుని నొసలితో వెక్కిరిస్తున్నారన్నారు. మన పథకాలు దేశానికి ఆదర్శమయ్యాయని, తెలంగాణ గ్రామాల్లో ఉన్న సౌకర్యాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.

మన పథకాలను చూసి మహారాష్ట్ర, కర్ణాటక ఎమ్మెల్యేలు అక్కడ వీటిని అమలు చేయాలని లేదా తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని కాపీ కొట్టి  దేశ స్థాయిలో అమలు పరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.. ఒకటో స్థానానికి చేరాలన్నది మన తపన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం చిట్ట చివరన ఉందన్నారు. కంటి వెలుగు దేశానికి ఆదర్శమయిందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తోందన్నారు. మెదక్ జిల్లాలో పెండింగ్ బకాయిలు 8,10 కోట్లు త్వరలో క్లియర్ చేస్తామన్నారు. కరెంటు కోసం నెలకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, తెలంగాణలో 57 లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతోందని, ఆంధ్రప్రదేశ్ లో కేవలం  16 లక్షల ఎకరాలు యాసంగి పంట ఉందన్నారు. 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని వివరించారు. 

 రైతు పక్షపాతి గనుకే కేసీఆర్
ఎంత భారమైనా భరిస్తున్నారన్నారు. కేంద్రం వ్యవసాయ మోటర్ల కు మీటర్లు పెడితే 30 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చేదన్నారు. నష్టమైనా భరిస్తాం కానీ మీటర్లు పెట్టడానికి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు.
 ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ చేయూత అందించడంతో గ్రామాలు నేడు అద్దంలా తయారయ్యాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ సహకారంతో ఇదే స్ఫూర్తితో పంచాయతీలు మరిన్ని అవార్డులు సాధించాలన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పంచాయతీలకు అవార్డులు రావడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, జిల్లా అధికారులు సాయిబాబా, శైలేష్ కుమార్, శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లాలోని  ఎంపీపీ అధ్యక్షులు, జడ్పిటిసిలు, జిల్లా అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు పంపిణీ.. 
చిన్న శంకరంపేట్ మండలం టి.మాందాపూర్ కు చెందిన 39 మంది లబ్దిదారులకు ధరణి పాస్ పుస్తకాలను, ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్  భవన్ నిర్మాణానికి 4  గుంటల   స్థలం పత్రాలను మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. అదేవిధంగా  బ్రాహ్మణ సంఘానికి 30 గుంటల  స్థల ధ్రువపత్రాలను  మంత్రి అందజేశారు.


రేడియాలజీ హబ్ ప్రారంభం
జిల్లా  ప్రధాన ఆసుపత్రిలో కోటి 55 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించి రోగులను ఆప్యాయంగా పలకరించి వైద్య సదుపాయాలు అందుతున్న తీరు, నూతన డైట్ ప్లాన్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ హబ్ ద్వారా  2డి-ఎకో, అల్టాసౌండ్, ఈసీజీ, మమోగ్రామ్, ఎక్సరే  పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుతం అందిస్తున్న సేవలపై ఎన్ని మార్కులు వేస్తారని రోగులను ప్రశ్నించగా వందకు వంద మార్కులు వేస్తామని చెప్పడంతో మంత్రి సంతోషం  వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంఅండ్ హెచ్ఓ చందు నాయక్, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

మే 20 నాటికి పూర్తి చేయండి
నూతన కలెక్టరేట్, జిల్లా పొలీసు  కార్యాలయ భవనాలు మే 20 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు  హరీష్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ శాసనసభ్యురాలు,  పద్మాదేవేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్ లో జరుగుచున్న పనులను పరిశీలించిన అనంతరం  ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని,  ప్రగతిలో ఉన్న ప్రహారి గోడ, సి.సి. రోడ్డు  పనులు శరవేగంతో పూర్తి  చేయాలన్నారు. రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో పెయింటింగ్, శానిటరి  ఫిట్టింగ్ వంటి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను ముమ్మరం చేయాలన్నారు. అనంతరం రహదారులు, భవనాల శాఖ ద్వారా మెదక్, నర్సాపూర్, అందోల్, నారాయణఖేడ్, దుబ్బాక, గజ్వెల్  నియోజక వర్గాలలో  చేపట్టిన బి.టి. రోడ్ల పునరుద్ధరణ పనుల ప్రగతిని సమీక్షిస్తూ 2021-22 సంవత్సరంలో 16 కోట్ల 20  లక్షల వ్యయంతో 46 కిలో మీటర్ల  అభివృద్ధికి 9 పనులు,2022-23 లో 49 కోట్ల వ్యవయంతో 86 కిలో మీటర్ల  అభివృద్ధికి 13 పనులు చేపట్టుటకు  వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద గిరిజన తండాలలో బి.టి. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పధకం క్రింద మెదక్ నియోజక వర్గంలో 43 కోట్ల 77 లక్షల వ్యవయంతో 42 .55 కిలో మీటర్ల రహాదారి నిర్మాణానికి 25 పనులు,  నరసాపూర్ నియోజక వర్గంలో 64 కోట్ల 17 లక్షల వ్యవయంతో 81. 21 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి 30 పనులు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వ్యవయంతో 3 కిలో మీటర్ల రహాదారి నిర్మాణానికి 2 పనులు చేపట్టుటకు వెంటనే  టెండర్లు ఆహ్వానించవలసినదిగా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఎస్.సి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి దయారా వరకు 2  కిలో మీటర్ల రహాదారి నిర్మాణానికి 7 కోట్ల 80 లక్షలు మంజూరు చేశామని, ఇట్టి పనులు కూడా కాంట్రాక్టర్  వెంటనే చేపట్టుటకు టెండర్లు పిలవవలసినదిగా సూచించారు. కలెక్టర్,  ఎమ్మెల్యే  ఇంజనీరింగ్ అధికారులు సమావేశమై  త్వరగా టెండర్లు ఫైనల్ చేసి ప్రతి నియోజక వర్గంలో పనులు ప్రారంభించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా కు సూచించారు. ఈ సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్, తదితరులు పాల్గొన్నారు.