గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహిద్దాం

గ్రూప్-1  ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహిద్దాం

కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్:  టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించే  గ్రూప్-1  ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహించుటకు సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై   ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ తో  కలిసి సమీక్షించారు. వచ్చే జూన్ 11న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు టిఎస్పిఎస్సి జిల్లాకు 3,960 అభ్యర్థులను కేటాయించే అవకాశమున్నందున అందుకనుగుణంగా మౌలిక వసతులున్న కేంద్రాలను గుర్తించి, చీఫ్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను నియమించేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. లు సాయిరాం, శ్యామ్ ప్రకాష్, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,  తహసీల్ధార్లు శ్రీనివాస్, ఆంజనేయులు, జ్ఞానజ్యోతి, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితరులున్నారు.

ఎరువుల ఇబ్బందుల్లేకుండా చర్యలు

రాబోవు వర్షాకాలంలో పంటలకు అవసరమైన  సరిపడా ఎరువులను  ముందస్తుగానే ప్రణాళిక చేసుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు.  వచ్చే వర్షాకాలానికి  సంబంధించి  జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలకు సరిపడా ఎరువులను సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లపై  వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్, ఆగ్రోస్,ప్రాథమిక సహకార సంఘం అధికారులు, ప్రైవేటు ఎరువుల సరఫరా దారులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షించారు. ఈ వానాకాలంలో యూరియా, డి.ఎ .పి , కాంప్లెక్స్, ఏం.ఓ.పి , ఎస్.ఎస్..పి  వంటి రసాయన ఎరువులు 96,340 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేయడం జరిగిందన్నారు. కాగా రైతులకు ఎరువుల కొరత రాకుండా  మే నుండి సెప్టెంబర్ వరకు మాసం నిర్దేశించుకున్న లక్ష్యానికి అదనంగా పది శాతం స్టాకుతో ఎరువులు సరఫరా చేయుటకు సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, జిల్లా సహకార అధికారి కరుణ, మార్క్ ఫెడ్  జిల్లా మేనేజర్ క్రాంతి, అగ్రో రైతు సేవా కేంద్రం, హా క , ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు తదితరులు  పాల్గొన్నారు.