రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు

రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు

బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బిఆర్ ఎస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కటింగుల పేరుతో రైతులను ఇంకా ముంచుతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి, బిజేపి రైతు నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డిలు మండిపడ్డారు. జగిత్యాల రూరల్  మండలం జాభితాపూర్ ఐకేపీ సెంటర్ లో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని అన్నారు. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్న రైతన్నను రైస్ మిల్లర్లతో మీరు కుమ్మక్కై దోచుకుంటారా? ఆదుకోవాల్సింది పోయి అడ్డగోలు దోపిడీ చేస్తారా? ఇదేనా రైతుల పట్ల మీకున్న విధానం అంటూ ప్రశ్నించారు.

నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు పూర్తికావడం లేదని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు కష్టాలు పడుతున్నారని, క్వింటాలుకు 7 నుంచి 10 కిలోలు అదనంగా తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో కటింగ్ చేస్తే  క్రిమినల్ కేసులు పెడతాం అన్నారు కదా, ఇప్పటివరకు ఎంతమంది మీద  క్రిమినల్ కేసులు పెట్టారని ప్రశ్నిచారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, రూరల్ మండలం వైస్ ప్రెసిడెంట్ కొలగనినరేష్, కిసాన్ మోర్చా జగిత్యాల రూరల్ ఉపాధ్యక్షులు శెట్టి రవీందర్, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ అరిగేల శ్రీకాంత్, గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు.