పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
  • ఇండ్లు కూలిన వారికి నష్ట పరిహారం చెల్లించాలి
  • గాంధీనగర్ కార్పొరేటర్ ఎనుగు పావని 

ముద్ర, ముషీరాబాద్: హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో భాగంగా నాలా పరివాహక బస్తీ సబర్మతి నగర్ లో పేదల ఇళ్లను ముందు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా కూల్చి వేయడాన్ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్  ఎనుగు పావని తీవ్రంగా ఖండించారు. ఇరిగేషన్ అధికారులు తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు  వెంటనే కార్పొరేటర్ ఏనుగు పావని, బిజెపి నగర నాయకులు ఎనుగు వినయ్ కుమార్ తదితర నాయకులతో కలసి సబర్మతి నగర్ బస్తీ కి చేరుకొన్నారు. ఇళ్ళ కూల్చివేత నిర్వహించే ప్రాంతాన్ని బాధితులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం ముందుగా ఎక్కడి వరకైతే ఇళ్ళ కూల్చివేతకు మార్కింగ్ చేశారో అంతవరకు కాకుండా లేనిపోని సాకులతో చిన్నపాటి ఇళ్లను ఎక్కువ భాగం కూల్చి వేయడం సరికాదన్నారు. పేద ప్రజలను రోడ్డు పైకి తెచ్చే అధికారుల నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం నాలా కు అనుకొని వున్న పేదల ఇళ్ళల్లో ఒక్క ఇటుక కూడా తొలగించకుండా, ఇళ్లకు ఎలాంటి హానీ కలగకుండా రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామన్న మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతేన లేకుండా పోయిందని మండిపడ్డారు. తప్పని సరిగా కొంత భాగం కూల్చి వేయాల్సవస్తే ముందుగా భాదితులకు నష్ట పరిహారం చెల్లించాలని లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి, పట్టాలను వారికి అందించిన తరువాతే ఇళ్ళను కూల్చాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కూల్చివేత పనులు చేపడితే బస్తీలోని ఇళ్ల భాదితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం ఉమేష్ లక్ష్మణ్ యాదవ్, రహమత్ ఆలి, కాంగ్రెస్ నాయకులు హరి కృష్ణ, స్థానికులు హఫిజ్, గిరి, చాంద్ పాషా, సఫియ బేగం, ఈరమ్మ, సంధ్య రాణి, సొనమ్మ  భాదితులు పాల్గొన్నారు.