ప్రమాదం అంచున జములమ్మ కరకట్ట

ప్రమాదం అంచున జములమ్మ కరకట్ట

జోగులాంబ గద్వాల్, గద్వాల్ రూరల్ ముద్ర ప్రతినిధి : రాళ్లు పడిపోయి బలహీనంగా మారిన కరకట్ట రివిట్‌మెంటు రాళ్లు తొలగిపోయి నెర్రెలు. లీకేజీ నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటార్లు
నిర్వహణకు ప్రతీ ఏడాది రూ.40 లక్షల ఖర్చు 38 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని కట్ట గద్వాల రూరల్‌ జములమ్మ ఆలయానికి రక్షణ కల్పించే కరకట్ట ప్రమాదం అంచున ఉంది. 38 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కరకట్ట మరమ్మతులు లేక బలహీనపడింది. రిజర్వాయర్‌ నుంచి లీకేజీలు పెరిగిపోవడంతో ప్రతీ రోజు మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రతీ ఏడాది రూ.40 లక్షల ఖర్చును భరిస్తున్న ఇరిగేషన్‌ శాఖ, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కరకట్ట పరిస్థితిపై నిర్వహణా సిబ్బంది ప్రతీ సంవత్సరం రిపోర్టు చేస్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌ కుమార్‌, ఈవో కవితలు మంగళవారం పవర్‌బోటులో వెళ్లి కరకట్ట పరిస్థితిని పరిశీలించి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి విన్నవించారు.

ఆలయాన్ని ముంపు నుంచి కాపాడేందుకు

గద్వాల పట్టణానికి మంచినీటి సమస్యను తీర్చడానికి 1983లో 0.38టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి, జూరాల కుడి కాలువను లింక్‌ చేశారు. అయితే రిజర్వాయర్‌ నిర్మాణంతో దేవాలయం ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆలయాన్ని వేరే చోటుకు తరలించేందుకు యత్నించారు. కొన్ని కారణాల వలన అది సాధ్యం కాలేదు. దీంతో ఆలయాన్ని రక్షించేందుకు ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చుట్టూ కరకట్ట నిర్మించారు. దాని నిర్వాహణ బాధ్యతను కూడా వారే తీసుకున్నారు.

బలహీనపడుతున్న కరకట్ట

అమ్మవారి ఆలయాన్ని రక్షించేందుకు నిర్మించిన కరకట్ట క్రమంగా బలహీనం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు మరమ్మతులు చేపట్టకపోవడం ఒక కారణం కాగా, భక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరో కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతీ ఏడాది ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు వంటలు వండుకునేందుకు, నైవేద్యం తయారీ కోసం పొయ్యిలు ఏర్పాటు చేసుకునేందుకు కరకట్ట రివిట్‌మెంట్‌ రాళ్లను తొలగించి వినియోగిస్తూ ఉన్నారు. దీంతో కరకట్ట బలహీ నపడ్తూ వస్తోంది. దీనికి తోడు కట్ట చుట్టూ ముళ్ల పొదలు పెరగడంతో రివిట్‌మెంటు కదిలి, నెర్రలు రావడంతో లీకేజీలు పెరుగుతున్నాయి. ఆలల తాకిడికి మట్టి కరిగిపోయి రాళ్లు రిజర్వాయర్‌లోకి జారిపోతున్నాయి.

ఏటా రూ.15 లక్షల విద్యుత్‌ బిల్లులు

రిజర్వాయర్‌ నుంచి లీక్‌ అవుతున్న నీటిని ప్రతీ రోజూ ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఒక్క రోజు నీటిని ఎత్తిపోయక పోతే పరశురాముడి ఆలయంలోకి నీరు చేరుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే అమ్మవారి ఆలయం వరకు నీరు వస్తుంది. లీకేజీ నీటిని ఎత్తిపోసేందుకు 15 హెచ్‌పీ మోటార్లు రెండు, 10 హెచ్‌పీ మోటారు ఒకటి ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మోటార్లకు సంబంధించి ఏటా దాదాపు రూ.15 లక్షల మేర విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. మరమ్మతుల కోసం మూడు లక్షల రూపాయలు, సిబ్బంది జీతాలకు రూ.24 లక్షలు వ్యయం అవుతోంది. ఇలా ప్రతీ ఏడాది దాదాపు రూ.40 లక్షలు ఖర్చు అవుతున్నాయి. కానీ కరకట్ట పటిష్ఠానికి చర్యలు తీసుకోకపోవడం సమస్యగా మారింది.

మూడు నెలల క్రితం పరిశీలించాం

ఆలయానికి వచ్చే భక్తులు నైవేద్యం తయారీకి పొయ్యిల ఏర్పాటు కోసం కరకట్ట రాళ్లను తొలగిస్తున్నారు. దీంతో అది బలహీనం అవు తున్నది. మూడు నెలల క్రితం ఎస్‌ఈ, ఈఈల ఆధ్వర్యంలో కరకట్టను పరిశీలించాం. దానిని పటిష్ఠం చేసేందుకు ప్రతి పాదనలను తయారు చేస్తున్నాం. భక్తులు రాళ్లను తొలగించకుండా ఆలయ అధికారులు బాధ్యత వహించి ఉంటే పరిస్థితి ఇలా అయ్యేది కాదు