మీ అభిమానమే నన్ను గెలిపిస్తుంది – జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల

మీ అభిమానమే నన్ను గెలిపిస్తుంది – జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల) : నాపై మీకున్న అభిమానం, నమ్మకమే నన్ను గెలిపిస్తుందని జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చేర్యాల మండలం ముస్త్యాల ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. మహిళలు మంగళ హారతులతో ఆహ్వానం పలకగా.. దీర్ఘకాళిక ప్రయోజనాలతో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను ఆరుట్ల ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ మేనిఫెస్టోలో వృద్దులు, మహిళలు, విద్యార్థులు, బీసీలు, ఉద్యోగులు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమల పురోగతి కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి జరిగిందేమీలేదన్నారు. గత రెండు దశాబ్దాలుగా చిన్నాచితకా పనులు తప్పిస్తే వారు చేసిందేమీలేదని విమర్శించారు. జనగామ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని విమర్శించారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని దశమంతరెడ్డి హామీ ఇచ్చారు.