నా కట్టె ఇక్కడే కాలుతది..!

నా కట్టె ఇక్కడే కాలుతది..!
  •  నా చితాభస్మాన్ని జనగామ చెరువుల్లో కలపిండి
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 
  • పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి, జనగామ: ‘నా తుది శ్వాస వీడే వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ.. జనగామ ప్రజలకే సేవ చేస్తా.. రేపు నేను గతిస్తే నా కట్టె ఇక్కడే కాలుతది.. నా చితాభస్మాన్మి జనగామలో ఉన్న చెరువుల్లో కలపాలి.. ఇది నా కోరిక..’ అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ముందుగా పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, సీనియర్‌‌ లీడర్లు మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న అంతర్గ వర్గపోరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. ముత్తిరెడ్డికే ఈసారి టికెట్‌ వస్తుందని, ఆయనను మూడో సారి గెలిపించుకుని మంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఒక వేళ ముత్తిరెడ్డికి కాకుండా వేరే వ్యక్తలకు టికెట్‌ ఇస్తే గెలిచే సీటు పోగొట్టుకున్నట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే లీడర్లు అనుమానాలపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి తాను తుది శ్వాసవీడే వరకు ఇక్కడే ఉంటానని, ఇక్కడి ప్రజలకే సేవ చేస్తానని చెప్పారు. ఒక వేళ తాను చనిపోయిన తన కట్టే ఇక్కడే కాలుతుందని ఎమోషనల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌‌ చేసిన పోరాటాలు, వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే వివరంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎన్ని హామీలు ఇచ్చిందని, వాటిని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సంతకాలు చేసిందన్నారు. కానీ ఇప్పటి వరకు అవి నెరవేర్చలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తమ పథకాలపై కేంద్ర సంస్థలు మెచ్చుకుని లిఖిత పూర్వకంగా లేఖలు ఇస్తున్నాయని చెప్పారు. కానీ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరు ఎన్ని జిమిక్కులు చేసినా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్‌‌ఎస్‌ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. 

ముత్తిరెడ్డి విజన్‌ ఉన్న లీడర్‌‌ : ఎమ్మెల్సీ కోటిరెడ్డి
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంచి విజన్‌ ఉన్న లీడర్‌‌ అని పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాక వ్యవసాయరంగ అభివృద్ధి కోసం స్థానిక చెరువులను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ విషయం తాను వేరే నియోజకవర్గాల్లో కూడా విన్నానని చెప్పుకొచ్చారు. పట్టణ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారన్నారు. ఇలాంటి నేతను ప్రజలు వదులు కోరన్నారు. మూడాసారి కూడా ముత్తిరెడ్డి ఘన విజయం సాధించి జనగామ ప్రజలకు సేవలందిస్తారని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో జనగామ మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు బండ పద్మ, క్రరె శ్రీనివాస్‌, పాండు, అనిత, సమద్, స్వరూప, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, సీనియర్‌‌ లీడర్లు పసుల ఏబేలు, ఉడుగుల కిష్టయ్య, మల్లిగారి రాజు, కందుకూరి ప్రభాకర్, వంగ ప్రనీత్‌రెడ్డి, పానుగంటి ప్రవీణ్‌, మిద్దపాక లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.