అబద్ధాలు, అవినీతిలో కెసిఆర్ ప్రపంచ రికార్డు

అబద్ధాలు, అవినీతిలో కెసిఆర్ ప్రపంచ రికార్డు
  • కలిసి పని చేస్తే అధికారం ఖాయం
  • కాంగ్రెస్ కు నాలుగు గుర్రాల గుర్తు ఇవ్వాలి
  •  బిజెపి ఉమ్మడి జిల్లా ఇంఛార్జి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అవినీతిలో కూరుకపోయిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని, బిజెపి నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తే పార్టీకి అధికారం ఖాయమని బిజెపి ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి,మాజీ రాష్ట్ర మంత్రి మర్రి శశిధర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. పార్టీ నిర్మల్ జిల్లా పదాధికారుల సమావేశం సోమవారం నిర్మల్ లోని బాలాజీ బాంకెట్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో కొత్త, పాత అనే తేడాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజయాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు. పార్టీ లో పాత జిల్లాలకు విభాగ ప్రహారీల నియామకం జరిగిందని, వారు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తారన్నారు. బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ  బిజెపి,భారాస ల మధ్యే ఉంటుందన్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోందన్నారు. ఆపార్టీ పరిస్థితి కి నాలుగు గుర్రాల గుర్తు సరైందని ఎద్దేవా చేశారు.

అబద్ధాలే కెసిఆర్ ఎజెండా
అబద్ధాలే ఎజెండాగా, అవినీతే ధ్యేయంగా కెసిఆర్ ప్రపంచ రికార్డు సృష్టించారని మర్రి శశిధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. బిజేపి సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పుడు దళిత ముఖ్యమంత్రి పేరుతో మొదలైన అబద్ధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కాగా కాళేశ్వరం తో ప్రారంభమైన అవినీతి సెక్రటేరియట్ నిర్మాణం దాకా కొనసాగిందన్నారు. మభ్యపెట్టే వాగ్దానాలు చేసి మాట తప్పటంలో కెసిఆర్ కు సాటి ఎవరూ లేరన్నారు. 30 లక్షల యువతను వంచించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత బిజెపి వైపు చూస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో అల్జాపూర్ శ్రీనివాస్, పడకంటి రమాదేవి,మాజీ ఎంపి రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, భూమయ్య, రామనాథ్, మేదిసెమ్మెరాజు, సుధాకర్,రామారావు పటేల్, అలివేలు, రాజేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.