టో(తో)లు ఒలుస్తారు... సౌకర్యాలు పట్టించుకోరు...

టో(తో)లు ఒలుస్తారు...  సౌకర్యాలు పట్టించుకోరు...

జాతీయ రహదారిపై దిలావర్ పూర్ టోల్ ప్లాజా తీరు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల టోల్ ఫీజులు భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే టోల్ వసూళ్లపై కనబరుస్తున్న శ్రద్ధ సౌకర్యాల పట్ల చూపడం లేదు. ఇందుకు నిర్మల్ మీదుగా వెళ్లే 61వ జాతీయ రహదారిపై దిలావర్ పూర్ సమీపంలోని టోల్ ప్లాజా యే ప్రత్యక్ష నిదర్శనం. నిర్మల్ మీదుగా మహారాష్ట్ర లోని కళ్యాణ్ వరకు 61వ జాతీయ రహదారి సేవలను అందిస్తోంది. అయితే ప్రైవేట్ సంస్థలకు ' బిల్డ్ అండ్ ఆపరేట్ ' పద్ధతిలో ఈ రోడ్లను నిర్వహిస్తున్న 'జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ' సౌకర్యాలు, రోడ్ల నిర్వహణ సక్రమంగా పట్టించుకోని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టోల్ ప్లాజా గుండా ప్రతిరోజు వేలాది వాహనాలు వెళుతుంటాయి. అయితే ప్రయాణికుల కోసం కనీసం సరైన మూత్రశాలలు కూడా లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం. ఇరుకైన టోల్ గేట్ లతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదిలా ఉండగా రోడ్ల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉన్నది. రోడ్లమీద గుంతలు పడినపుడు  వాటి మరమ్మతులు కూడా తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు కొంత భాగం మాత్రమే బీ టీ వేయటం వల్ల ఎగుడు దిగుడు గా మారి ద్విచక్ర వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.పలుచోట్ల రోడ్లు సరిగా లేని కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్న ఘటనలు జరిగాయి. ఈ రోడ్డు గుండా రాష్ట్ర మంత్రులు, ఉన్నత హోదాల్లో ఉన్న అధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సౌకర్యాల కల్పన, రోడ్ల నిర్వహణపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.