జీ 20 సదస్సులో కరీంనగర్  సిల్వర్​ఫిలిగ్రీ కళాఖండాలు

జీ 20 సదస్సులో కరీంనగర్  సిల్వర్​ఫిలిగ్రీ కళాఖండాలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఢిల్లీలో జరిగే జీ20 సదస్సులో కరీంనగర్ కళాకారులకు అపురూప గౌరవం దక్కింది. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హాజరు కానున్న అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు రూపొందించిన అశోక చక్ర ఆకారంలో ఉన్న వెండి తీగతో తయారుచేసిన బ్యాడ్జీలు తొడగనున్నారు. మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుండి తరలించారు. దీనితో పాటు మరో అరుదైన అవకాశం దక్కింది. సమావేశాలు జరిగే చోట సిల్వర్ పిలిగ్రీ స్టాల్ కు అనుమతించారు.

400 సంవత్సరాల చరిత్ర కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొంతం. 520 మంది సభ్యులతో నిర్విరామంగా కొనసాగుతుంది. యునెస్కో అవార్డుతో పాటు మరో నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అత్యుత్తమ సంస్థ. బెస్ట్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అవార్డు తో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సంస్థ ఖ్యాతి దేశవ్యాప్తం అయింది. అంతర్జాతీయ సదస్సులో స్టాల్ కు అనుమతించడంతో కరీంనగర్ కళాకారులు చేసిన కళాఖండాలు విశ్వవ్యాప్తం కానున్నాయి. ప్రపంచంలోనే అత్యున్నత దేశాధినేతల సదస్సులో కరీంనగర్ కళాకారులకు అవకాశం కల్పించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.