అధిష్టానం వద్ద ఆధిపత్య పోరు

అధిష్టానం వద్ద ఆధిపత్య పోరు
  • కరీంనగర్ టికెట్ ప్రకటనను అడ్డుకుంటున్నది ఎవరు?
  • అలిగిరెడ్డిని ఆదుకునేది ఎవరు? - వెలిచాలను నిలబెట్టేది ఎవరు?
  • టికెట్ కేటాయింపులో మంత్రి పొన్నం "కీ" రోల్
  • తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ ఎంపీ టికెట్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఎవరికి కేటాయిస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా వెలిచాల రాజేందర్ రావు వైపు పొన్నం ప్రభాకర్ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, మూడు నియోజకవర్గ ఇన్చార్జీలు ఉన్నారు. రెండు వర్గాలుగా విడిపోయి తాము సూచించిన అభ్యర్థికే టికెట్ కేటాయించాలంటూ అధిష్టానం వద్ద ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు కరీంనగర్ టికెట్ ప్రకటించాల్సి ఉండగా వీరి ఆధిపత్య పోరు కారణంగా వాయిదా పడింది.

వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ కేటాయిస్తే నాతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత తీసుకుంటారని ముఖ్యమంత్రికి పొన్నం ప్రభాకర్ తెలిపినట్లు విశ్వాసనీయ సమాచారం. వెలిచాల ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా పరిగణించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 6 టికెట్లు రెడ్డిలకు కేటాయించారని ఖమ్మంతో పాటు కరీంనగర్ కూడా రెడ్డిలకే కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజేందర్ రావుకే టికెట్ కేటాయించాలని భీష్మించుకొని కూర్చున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. ఇది ఇలా ఉండగా మొదటినుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. నియోజకవర్గంలో 2.60 లక్షల రెడ్డి సామాజిక ఓట్లు ఉండడంతో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రవీణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంశం కలిసి వస్తుందని, ప్రస్తుతం అదే నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతుండడంతో మరో లక్ష 50 వేల ఓట్ల వరకు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉన్నట్లు తాజా సర్వేలో తేలిందని, ఆ రిపోర్టును సీఎం అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది.

నో ఈక్వేషన్స్ గెలుపు గుర్రాలకి టిక్కెట్లు అన్న సూత్రంతో సీఎం ముందుకు వెళ్తున్నారు. దీంతో కరీంనగర్ పార్లమెంటు టికెట్ పంచాయతీ ఢిల్లీ పెద్దలకు చేరింది. ఈరోజు టికెట్ ప్రకటించాల్సి ఉండగా ఇరు వర్గాల ఆధిపత్య పోరుతో అధిష్టానం వాయిదా వేసింది. ఇప్పటికే టిక్కెటు తనకే వస్తుందన్న ధీమాతో వెలిచాల రాజేందర్ రావు వర్గం పార్లమెంటు వ్యాప్తంగా బాణసంచా పేల్చిపెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. టిక్కెటు ఎవరికి వరిస్తుందోనని ఇరువర్గాల మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆధిపత్య పోరులో ఎవరు పంతం నెగ్గించుకుంటారో తేలాల్సి ఉంది.