హుస్నాబాద్‌ లో భూకబ్జా భాగోతం..

హుస్నాబాద్‌ లో భూకబ్జా భాగోతం..
land kabja in husnabad

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ లో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ధరణి పోర్టల్‌ లో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా భూములను కబ్జా చేస్తున్నారు. దీంతో గతంలో భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొనుక్కున్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారు.
హుస్నాబాద్‌ పట్టణ శివారులోని సబ్‌ స్టేషన్‌ ఎదురుగా సర్వే నెంబర్‌ 64 లో గల 4 ఎకరాల 9 గుంటల భూమిని 2009 వ సంవత్సరంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది అప్పటి భూ యజమానుల నుండి తమ భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడి తమ పేర నకిలీ భూ దస్తావేజులను సృష్టించుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్లుగా గతంలో ఆ భూమిని కొన్న వారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తిరిగి తిరిగి వేసారిన బాధితులు చివరకు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ అక్కడే ఉన్న హుస్నాబాద్‌ ఏసిపి సతీష్‌ ను పిలిచి బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు.