ఓసీ-3లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ఓసీ-3లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి
Locals should be given jobs in OC-3

వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు కిషన్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఓసీ-3లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓసీ-3 ప్రాజెక్టు కోసం అనేకమంది రైతులు తమ భూములను సింగరేణికి అప్పగిస్తే, ఇప్పటి వరకు స్థానికులకు ఉద్యోగులు కల్పించలేదని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా, రైతుల పిల్లలకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్నా కూడా ఉద్యోగ అవకాశం ఇవ్వడం లేదని, గణపురం మండలంలో ఉన్న యువతకి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, యువతను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటివరకి భూములు కోల్పోయిన వారిని సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.  ఓసీ-3లో బాంబు బ్లాస్టింగ్ వల్ల అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయని, అయినా పర్యావరణం పరిరక్షణ చేపట్టలేదని, సీఎస్ఆర్ నిధులు ఈ మండలంలో ఖర్చు పెట్టడం లేదని ఇప్పటికీ అనేక సందర్భంలో సింగరేణి యాజమాన్యాన్ని, ఓసీ-3లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను కూడా కలిసి భూ నిర్వాసితులు ఉద్యోగాల విషయంపై అనేక సార్లు మాట్లాడడం జరిగిందని అన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ ల నుండి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని. ఓసి-3 ప్రాజెక్టు పేరుతో తక్కువ జీతానికి ఇతర ప్రాంతాల నుండి కార్మికులను వలసవాదులను తీసుకుని ఓసి 3లో పనులు జరిపించడం, బొగ్గు ఉత్పత్తి చేయడం జరుగుతుందని స్థానిక నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేటట్లు తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని మా భూములు మాకు ఇవ్వండి లేదా స్థానిక నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి స్థానిక నిరుద్యోగులతో కలిసి త్వరలో ఓసి -3 ప్రాజెక్టు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఓసి2, ఓసీ3 ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు ఇప్పటివరకు సింగరేణి సంస్థ నుండి పూర్తి నష్టపరిహారం చెల్లించలేదని కొంతమంది బ్రోకర్లు ఈ సంస్థలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అసలైన రైతులకి పరిహారం అందకుండా నష్టం చేస్తున్నారని మళ్లీ ఓసి-2  ఓసి-3 భూములపై సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.

ఘణపురం నుండి ధర్మ రావుపేట వెళ్లే రహదారిలో మొరంచ వాగుపై నిర్మించిన వంతెన ఇరువైపులా ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని ప్రభుత్వం రెండోసారి ఏర్పడినప్పటికీ కనీసం ఒక కిలోమీటర్ మేరకు కూడా రోడ్డు నిర్మాణం చేపట్టలేదని గణపురం మండలం ఇప్పటికీ అభివృద్ధి లో వెనుకబడిందని   స్వతంత్రానికి ముందు ఏ విధంగా అయితే గణపురం ఉందో అదే మాదిరిగా గణపురం ఇప్పటివరకు కూడా ఉందని ఈ ప్రాంత ప్రజల్ని రాజకీయంగా ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు తప్ప అభివృద్ధిపై ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు.  స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాలని ఈ ప్రాంతాన్ని ఫుడ్ ఇండస్ట్రీ ప్రాంతంగా తయారు చేసి, అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సొక్కమ్  సదయ్య, ముదిరాజ్ జిల్లా యూత్ అధ్యక్షుడు దొండపాటి మధుకర్ రెడ్డి, నాయకులు పెంట సంతోష్, శ్రీనివాస్, శ్రావణ్, రెబ్బ శ్రావణ్, చందు, ప్రసాద్ పాల్గొన్నారు.