సంక్షేమ పథకాలు,రిజర్వేషన్ల అమలుకు అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి.. 

సంక్షేమ పథకాలు,రిజర్వేషన్ల అమలుకు అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి.. 
  • అంబేడ్కర్ ఆలోచన విధానం అమలుతోనే విగ్రహాల ఏర్పాటు లక్ష్యం సాకారం..
  • కుల గణన తో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అవకాశం..
  • అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సంక్షేమ పథకాలు,రిజర్వేషన్ల అమలుకు అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి అని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక అంబేడ్కర్ సంఘ్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూభారత రాజ్యాంగం స్ఫూర్తి తోనే రిజర్వేషన్ ఫలాలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటు తో పాటు ఆలోచన విధానం అమలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం తోనే ప్రపంచంలో భారత దేశం ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతోందిని,రాష్ట్రాల పునర్ విభజన, సరిహద్దుల మార్పు, నూతన రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేలా అంబేడ్కర్ రాజ్యాంగం రూపొందించడం తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయిందన్నారు.

కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని,రాజ్యాంగ మౌలిక సూత్రాలను అనుగుణంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు.కుల గణన పూర్తయితే జనాభా ప్రాతిపదికన  రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని సమాజంలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా 40 శాతం రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంటుందని అన్నారు.