మెదక్ లో అంగన్వాడి ఉద్యోగుల భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, మెదక్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో  భారీ ర్యాలీ,  నిరసన ప్రదర్శన  నిర్వహించారు. బుధవారం మెదక్ ఆర్డిఓ కార్యాలయం నుండి గుల్షన్ క్లబ్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్, చిల్డ్రన్స్ పార్క్ మీదుగా రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించారు. సర్కిల్లో మానవహారంగా నిలబడి తమ నిరసన తెలియజేశారు. సిఐటియు అంగన్వాడి ఉద్యోగులు, కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, నర్సమ్మ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయగా నలువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తమ నిరసన కార్యక్రమాలు మూడు రోజుల పాటు సాగుతాయని వారు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రాబోయే రోజుల్లో అంగన్వాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, ఐసీడీఎస్ కు సరిపడా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ఏర్పడి 47 సంవత్సరాలు పూర్తయిన    కేంద్ర ప్రభుత్వం  ఐసీడిఎస్ ను రెగ్యులర్ శాఖగా  గుర్తించడం లేదన్నారు. ఐసీడీఎస్ అనేది గ్రామంలో ఉన్న పేద తల్లులు, 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహారంతో పాటు 6 రకాల సేవలు, 5 లక్ష్యాల కోసం పని చేస్తున్నారన్నారు.  కార్మికులకు నష్టం చేసే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాయకుల అరెస్ట్, విడుదల
 రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా  మెదక్ ప్రాజెక్ట్ పరిధిలో  ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించగా  నాయకులను అరెస్ట్ చేశారు. తర్వాత విడుదల చేశారు. ఈ నీరసనలో అంగన్వాడి టీచర్లు,హెల్పెర్లు, మినీ టీచర్లు పాల్గొన్నారు.