ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న బిజెపి సర్కార్

ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న బిజెపి సర్కార్

కేంద్రంపై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శ

కేసముద్రం, ముద్ర: బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సూరత్ పోర్టు ద్వారా శిక్ష పడ్డ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, 24 గంటల్లోపే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి పదవి స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమానికి దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతుగా సమస్యలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. ఆ మేరకు రైతులకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

దేశంలో ఎక్కడ కూడా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం లేదని, రెండు పంటలకు సాగునీరు, సాగు పెట్టుబడి, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. దేశంలో కూడా రైతులకు ఇలాంటి పథకాలే అమలు చేసే విధంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసముద్రం మార్కెట్ యార్డులో రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన పాలకమండలి కృషి చేయాలని సూచించారు. కేసముద్రం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరిక మేరకు తప్పకుండా కేసముద్రం ను మున్సిపాలిటీ చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించి సామాన్యులకు పదవులు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు. దార్శనికతకు కేసిఆర్ పరిపాలన నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అంతకు ముందు నూతన మార్కెట్ చైర్ పర్సన్ గా నియమితురాలైన నీలం సుహాసిని, వైస్ చైర్మన్ రాంపల్లి రవి, ఇతర డైరెక్టర్లతో పదవీ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు, గ్రామ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.