మోసపూరిత వాగ్దానాల్లో మోడీ నంబర్‌‌ వన్‌

మోసపూరిత వాగ్దానాల్లో మోడీ నంబర్‌‌ వన్‌

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్. వీరయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడంలో ప్రధాని మోడీ నంబర్‌‌  వన్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్. వీరయ్య విమర్శించారు. బీజేపీ ప్రజా, కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం చేపట్టిన జన చైతన్య రథయాత్రలో మంగళవారం పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మణిహారమైన టెక్స్‌టైల్ పార్క్ మూసి, ఎంతోమంది కార్మికుల పొట్టకొట్టి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడే పరిస్థితిలో లేదన్నారు.

పేదలకు ఇండ్లు ఇవ్వలేని మోడీ.. తాను సన్యాసిని అని చెప్పుకుంటూనే రూ.467 కోట్ల ప్రజాధనంతో  పెద్ద భవనం కట్టుకోవడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ గురించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ బీజేపీ నాయకుడు కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మోసపూరిత వాగ్దానాలకు పెట్టింది పేరు బీజేపీ అని విమర్శించారు. అందుకే ఈ జన చైతన్య రథయాత్ర ద్వారా ప్రజలందరికీ వాస్తవాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు, ఆశయ్య, ఎం.ఆడవయ్య, జయలక్ష్మి, జగదీశ్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.