పద్మశాలీల రాజ్యాధికార సాధనకై చలో కోరుట్ల

పద్మశాలీల రాజ్యాధికార సాధనకై చలో కోరుట్ల
  • జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పద్మశాలీలకు రాజ్యాధికార సాధన కోసం ఆగస్టు 13న కోరుట్లలో రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించి మాట్లాడారు.

పద్మశాలీలను ఓట్లవేసే యంత్రాలుగా ఉపయోగించుకుని, అధికారంలోకి రాగానే  నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమకు 10 ఎమ్మెల్యే సీట్లు 2ఎంపి  సీట్లు, రెండు ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సీట్లను కేటాయించాలని, పద్మశాలీలకు డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వని రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తమకు కూడా పద్మశాలీ బందు ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇచ్చి బీద చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత వృత్తి చేసే వారికి రైతుబంధు లాగా నెలకు 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆకలి చావులు ఆపాలని, క్రిమిలేయర్ నుండి పద్మశాలి కులాన్ని తొలగించాలని, రంగులను నూలును 100% సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తాము ముందుండి పోరాడామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ ,సిరిపురం యాదయ్య,  పద్మశాలి టైగర్ ఆలే నరేంద్ర,  వనం ఝాన్సీ రాణి చేసిన  త్యాగాలు విస్మరించరాదన్నారు. ఆగస్టు 13న జరిగే మహాసభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలీలందరూ తమ ఇంటి శుభకార్యం అనుకొని పిడికిలి బిగించి పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శక్తిని ప్రదర్శించి రాజకీయ పార్టీలకు దడ పుట్టే విధంగా సభను విజయవంతం చేయాలని కోరారు.  సంఘటితం అయినప్పుడే తమ బలాన్ని చూసి అన్ని రాజకీయ పార్టీలు అనుకున్న సీట్లను కేటాయిస్తారని అన్నారు.ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చలమల్ల నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షులు పిషిక వీరయ్య, మాజీ కౌన్సిలర్ గండూరి రమేష్, మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల శారద దేవి, జిల్లా కార్యదర్శి దూలం నగేష్, ఎంపీటీసీ పొన్నం వెంకన్న, మిర్యాల గోపాలకృష్ణ, యలగoదుల సుదర్శన్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మిట్ట కోల యుగంధర్, కస్తూరి కిషన్, పున్న వెంకన్న,బల్నే క్రాంతి కుమార్, యన్నం ఉమ శంకర్, తదితరులు పాల్గొన్నారు.