చక్రబంధంలో పురుమల్ల శ్రీనివాస్

చక్రబంధంలో పురుమల్ల శ్రీనివాస్
  • పీడీ యాక్ట్ కు రంగం సిద్ధం?
  • కరీంనగర్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా పురుమల్ల
  • రాజకీయ ఎదుగుదలకు ప్రతిబంధకంగా భూకబ్జా కేసులు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ రాజకీయ చక్రబంధంలో చిక్కుకున్నారు. కరీంనగర్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాడు. మైనారిటీ ఓటు బ్యాంకు ఆయన వెనుక ఉండడమే కారణమా? కాపు సామాజిక వర్గం ఓట్లు చీలుతాయన్న భయమా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇదే నిజమైతే మంత్రి గంగుల కమలాకర్ కు రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  మైనారిటీలు గంగుల కమలాకర్ కు అండగా నిలిచారు. బిజెపి నుండి బండి సంజయ్ బరిలో ఉండడంతో ముస్లిం ఓటు బ్యాంకు గంపగుత్తగా గంగుల కమలాకర్ వైపు మొగ్గు చూపింది. కమలాకర్ సైతం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి నిధులు కేటాయిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. మంత్రి అయిన తర్వాత అధిక నిధులు కేటాయిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే చాలాకాలం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన పురుమల్ల శ్రీనివాస్ ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఖర్చుకు వెనకాడనని, సీనియర్ నేతగా, సర్పంచ్ గా నియోజకవర్గం పరిధిలో మంచి సంబంధాలు కలిగి ఉన్నానని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపినట్లు తెలిసింది. పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరి కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలబడతారని ప్రచారంలో ఉంది.

ఒకవేళ కాంగ్రెస్ నుంచి టికెట్ నిరాకరిస్తే ఎంఐఎం పార్టీ నుండి బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు చర్చ నడుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత ఇప్పటికే స్పష్టం చేశారు. శ్రీనివాస్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిస్తే రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలలో పురుమల్ల శ్రీనివాస్ హాట్ టాపిక్ మారారు. బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికంగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం బరిలో నిలిస్తే హోరాహోరీ పోరు తప్పదు. మైనారిటీ ఓట్లు చీలిపోతే బిజెపికి లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉదృతంగా కొనసాగుతుంది. ఈనెల 9వ తేదీన స్థానిక అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు సైతం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భూ కబ్జా కేసులు శ్రీనివాస్ ను వెంటాడుతున్నాయి. పలు కేసుల్లో పోలీసుల అరెస్టు నుండి మినహాయింపు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

41 పి ఆర్ సి కింద ముందస్తు నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నోటీసులు ఇవ్వడానికి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అరెస్టు చేస్తారని  ఆందోళన చెందిన శ్రీనివాస్ పోలీసులకు చిక్కలేదు. ఇప్పటికే అతనిపై సుమారు 24 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ సిపిగా కమలహాసన్ రెడ్డి ఉన్న సమయంలోనే అతనిపై పిడి యాక్ట్ పెట్టడానికి పోలీసులు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. అయితే  పురుమల్ల భూకబ్జా బాధితులు ఇటీవల సిపి ఎల్ సుబ్బారాయుడిని కలిసి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జా కేసును సీరియస్ గా తీసుకున్న సిపి విచారణ చేపట్టడానికి సిద్ధమయ్యారు. అయితే అతనిపై పదుల సంఖ్యలో కేసులు ఉండడంతో పోలీసులు అతనిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తారని కరీంనగర్ లో జోరుగా చర్చ నడుస్తుంది. అతని రాజకీయ ఎదుగుదలకు భూ కబ్జా కేసులు ప్రతిబంధకంగా మారాయి. బొమ్మకల్ సర్పంచ్ అజ్ఞాతం వెనుక రాజకీయ కోణం ఉందా లేక స్వయంకృతాపరాధమా తెలియాల్సి ఉంది. 9న జరిగే భారీ బహిరంగ సభకు నేరుగా చేరుకుంటాడనే చర్చ కొసమెరుపు.