రాహుల్ గాంధీది కులతత్వ మనస్తత్వం

రాహుల్ గాంధీది కులతత్వ మనస్తత్వం

రాహుల్ గాంధీది దారుణమైన కులతత్వ మనస్తత్వమంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. మోదీలు అందరూ దొంగలు అంటూ గతంలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం దావాలో రాహుల్‌ను దోషిగా తేల్చిన గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ఇంటిపేరు కలిగిన వారందరూ దొంగలుగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో మోదీల తరఫున పరువు నష్టం దావా పిటిషన్ దాఖలయ్యింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు.. శిక్ష అమలుపై 30 రోజుల స్టే విధించింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. తన తీర్పును పై స్థాయి కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్స్ చేసిన జేపీ నడ్డా.. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీలందరూ దొంగలంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. దీని ద్వారా ఆయనలోని దారుణమైన, కులతత్వ మనస్తత్వం తేలిపోయిందని నడ్డా ఆరోపించారు. గతంలో చౌకీదార్ చోర్ హై, రాఫెల్ స్కామ్ విషయంలోనూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని నడ్డా గుర్తుచేశారు. చాలా ఏళ్ల నుంచే రాజకీయ ప్రసంగ స్థాయిని రాహుల్ గాంధీ తగ్గించారని ఆరోపించారు. అబద్ధాలు, వ్యక్తిగత విమర్శలు, నెగటివ్ పాలిటిక్స్ ఎప్పుడూ రాహుల్ గాంధీలో అంతర్భాగంగా ఉన్నాయని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా వండివార్చిన రాఫెల్ స్కామ్ గురించి మాట్లాడేవారని అన్నారు.